Justin Trudeau: కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో తన చివరి మీడియా సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన 9 ఏళ్ల పదవీకాలంలో గందరగోళ క్షణాలను, డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ విధించిన భారీ సుంకాలను చర్చిస్తూ కంట తడి పెట్టారు. ప్రజాదరణ రేటింగ్ తగ్గుతున్న నేపథ్యంలో ట్రూడో జనవరిలో తాను ప్రధాని పదవికి, పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కెనడియన్లకు మొదటి ప్రాధాన్యం ఉండాలనే తన నిబద్ధతను చెప్పారు.
Read Also: Wife harassment: భార్య, అత్త వేధింపులకు మరొకరు బలి.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్..
‘‘ నా పాలనలో ప్రతీ రోజు నేను కెనడియన్లకు మొదటి స్థానం ఇస్తానని, నాకు ప్రజలు వెన్నదన్నుగా ఉన్నారు. ఈ ప్రభుత్వ చివరి రోజుల్లో కూడా, మేము కెనెడియన్లను నిరాశపరచము’’ అని ట్రూడో అన్నారు. ఈ ఆదివారం అధికార లిబరల్ పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ట్రూడో తన పదవి నుంచి వైదగనున్నారు. ప్రధానిగా తన చివరి ప్రసంగంలో, కెనెడియన్ల మధ్య ఐక్యత ఉండాలని నొక్కిచెప్పారు. ట్రంప్ సుంకాలు, కెనడా అమెరికాలో విలీనం కావాలనే ట్రంప్ వ్యాఖ్యలపై మాట్లాడుతూ, రాబోయే కఠిన సమయాల గురించి హెచ్చరించారు.
ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి, కెనడాని అమెరికాలో 51వ రాష్ట్రంగా మారాలని పలుమార్లు కామెంట్స్ చేశారు. ట్రూడోని ఆ రాష్ట్రానికి గవర్నర్‌గా మారాలంటూ కోరారు. అయితే, ఈ వ్యాఖ్యలను ట్రూడో ఖండించారు. కెనడియన్లు ఎప్పటికీ కెనడియన్ల గానే ఉంటారని ట్రూడో అన్నారు. ఇదిలా ఉంటే, ట్రంప్ రావడంతోనే కెనడియన్ ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధించారు. అయితే, మార్కెట్లు కుప్పకూలిన తర్వాత దీనిని ఒక నెల పాటు వాయిదా వేశారు.