Israeli Operation: ఇజ్రాయిల్ ఇరాన్‌ని తన అస్తిత్వానికి ముప్పుగా చూస్తోంది. ఇరాన్ చేతికి న్యూక్లియర్ ఆయుధాలు రావద్దనేది ఇజ్రాయిల్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో, తాజాగా ఇజ్రాయిల్ ఇరాన్ మీద విరుచుకుపడుతోంది. ముఖ్యంగా, ఇరాన్ అణు కార్యక్రమాలపై, వారి సైంటిస్టులను టార్గెట్ చేసి దాడులు చేసింది. 2005 నుంచి ఇజ్రాయిల్ ఇరాన్ అణు కార్యక్రమాలను నిశితంగా గమనిస్తోంది. ప్రస్తుతం, ఇరాన్ అణ్వాస్త్రాలకు అవసరమయ్యే యూరేనియాన్ని శుద్ధి చేసినట్లు అనుమానిస్తున్న ఇజ్రాయిల్, భారీ దాడులు చేసింది.
అయితే, ఇజ్రాయిల్ ఆపరేషన్స్ ఇదే మొదటిసారి కాదు. 1981లో ఇరాక్ పై కూడా ఇలాగే దాడులు చేసింది. జూన్ 7, 1981లో 14 ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు సినాయ్ ద్వీపకల్పంలోని ఎట్జియన్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరి, రెండు గంటల కన్నా తక్కువ సమయంలోనే ఇరాక్ రాజధాని బాగ్దాద్‌పై దాడులు చేశాయి. బాగ్దాద్‌కి సమీపంలో ఉన్న ఒసిరాక్ అణు రియాక్టర్‌పై ఇజ్రాయిల్ ఫైటర్ జెట్లు విరుచుకుపడ్డాయి. ఏకంగా 1100 కి.మీ ప్రయాణించి ఇజ్రాయిల్ సైన్యం ఈ దాడి చేసింది. ‘‘ఆపరేషన్ ఒపెరా’’ అనే కోడ్‌నేమ్ తో నిర్వహించిన ఈ దాడి అప్పట్లో సంచలనంగా నిలిచింది.
సరిగా నాలుగు దశాబ్ధాల తర్వాత, ఇప్పుడు ఇరాన్ వంతు వచ్చింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ వంతు వచ్చింది. శుక్రవారం ఉదయం నుంచి ఇజ్రాయిల్ దాడులు మొదలు పెట్టింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ వాణిజ్య రాజధాని టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది.
సద్దాం హుస్సేన్ ఆశలు ఆవిరి:
ఇరాక్ అణు కార్యక్రమం 1950 చివర్లో ప్రారంభమైంది. అయితే, 1970లో సద్దాం హుస్సేన్ హయాంలో ఈ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. 1976లో ఇరాక్ ఫ్రాన్స్‌తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఫ్రెంచ్ ప్రభుత్వం ఇరాక్‌కు 70 మెగావాట్ల పరిశోధన రియాక్టర్‌ను సరఫరా చేసేందుకు అంగీకరించింది. రియాక్టర్ డిజైన్ పేరు ఒసిరాక్. ఒసిరాక్ తో పాటు బాగ్దాద్ కు ఆగ్నేయంగా తువైతా న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ లో తముజ్ -2 అనే చిన్న ట్రైనింగ్ రియాక్టర్ నిర్మాణం జరుగుతోంది.
అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) కింద ఉన్న రియాక్టర్‌లను అధికారికంగా శాంతియుత ప్రయోజనాల కోసం నియమించారు. అయితే, ఒకసారి రియాక్టర్ ప్రారంభమైన తర్వాత దీనిని ఆయుధ గ్రేడ్ ఫ్లూటోనియం ఉత్పత్తి చేయడానికి ఒసిరాక్‌ని తిరిగి ఉపయోగించవచ్చని ఇజ్రాయిల్ నిఘా పసిగట్టింది. ఇది తన ఉనికికి ముప్పుగా మారుతుందని భావించింది. అయితే, రియాక్టర్ ఆపరేషనల్ స్టేటస్‌కి చేరుకున్న దానిని నాశనం చేయడం ప్రమాదమని ఇజ్రాయిల్ భావించింది.
ఇజ్రాయిల్ ఆపరేషన్:
అప్పటి ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) చీఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాఫెల్ ఈటన్ ఆధ్వర్యంలో ప్లాన్ ప్రారంభమైంది. రాజకీయ, సాంకేతిక కారణాల వల్ల ఆపరేషన్ పదేపదే ఆలస్యం అయింది. ప్రారంభ దశల్లో, ఇజ్రాయెల్ వైమానిక దళం F-4 ఫాంటమ్ ఫైటర్ జెట్‌లను ఉపయోగించాలని ప్రణాళిక వేసింది. కానీ ఇజ్రాయెల్ మరింత అధునాతన అమెరికన్ F-16లను కొనుగోలు చేయడంతో ప్రణాళిక మారింది.
1980లో ఎనిమిది F-16A ఫైటర్‌లను దాడి చేసే ఎయిర్ క్రాఫ్ట్‌లుగా, వీటికి కవర్ బ్యాకప్ అందించడానికి మరో ఆరు F-15Aలను ఏర్పాటు చేసింది. శత్రువు ఫైటర్లను గుర్తించకుండా, రాడార్లకు చిక్కకుండా రియాక్టర్లను నేలమట్టం చేయాలని ఇజ్రాయిల్ ప్లాన్ చేసింది. ఇరాక్‌కి అనుమానం కలుగకుండా 100 అడుగుల ఎత్తులో రాడార్లకు చిక్కకుండా ఆపరేషన్ నిర్వహించాయి.
దాడిని గుర్తించిన జోర్డాన్ రాజు:
అయితే, ఈ దాడిని ముందుగా జోర్డార్ రాజు గుర్తించాడు. యుద్ధవిమానాలను జోర్డాన్ మీదుగా ఆగ్నేయ దిశగా సౌదీ అరేబియా గగనతలంలోకి ప్రవేశించి, అక్కడ నుంచి బాగ్దాద్ వైపు వెళ్లాయి. ఈ రూట్‌ని అప్పటి ఇజ్రాయిల్ ఎయిర్ చీఫ్ మేజర్ జనరల్ డేవిడ్ ఇవ్రీ ఎంపిక చేశారు.
దీంతో ఇరాకీ రాడార్ల నుంచి ఇజ్రాయిల్ విమానాలు తప్పించుకున్నప్పటికీ ఇరాక్ రాజు హుస్సేన్ ఈ యుద్ధ విమానాలను గుర్తించాడు. రాజు తన రాయల్ యాచ్‌లో సెలవులను ఎంజాయ్ చేస్తున్న సమయంలో వీటిని గుర్తించి, దాడి విషయాన్ని అంచనా వేసి, ఇరాక్‌కి సమాచారం అందించాలని తన ప్రభుత్వాన్ని ఆదేశించారు. అయితే, కమ్యూనికేషన్ వైఫల్యం కారణంగా ఈ సమచారం బాగ్దాద్‌కి చేరుకోలేదు.
రెండు నిమిషాల్లోనే విధ్వంసం:
దాడి రోజు సాయంత్రం 5.35 గంటలకు ఎఫ్-16 విమానాలు కేవలం ఐదు సెకన్లలోనే తన బాంబులను జారవిడిచింది. కేవలం రెండు నిమిషాల్లోనే ఇరాక్ రియాక్టర్లను తుడిచిపెట్టింది. ఎలాంటి నష్టం లేకుండా ఇజ్రాయిల్ విమానాలు గమ్యస్థానాలకు చేరుకున్నాయి.
అయితే, ఈ దాడిని ఐక్యరాజ్యసమితి ఖండించింది. దీంతో పాటు మిత్రదేశం అమెరికా కొన్నాళ్ల పాటు సైనిక డెలివరీలను తాత్కాలికంగా నిలిపేశారు. రియాక్టర్లను సరఫరా చేసిన ఫ్రాన్స్ కూడా ఈ దాడిని ఖండించింది. అప్పటి ఇజ్రాయిల్ ప్రధాని మెనాచెమ్ బిగిన్ మాట్లాడుతూ.. ఏ అరబ్ దేశాన్ని కూడా అణ్వాయుధాలు తయారు చేయనీయమని స్పష్టం చేశారు. దీనినే ‘‘బిగిన్ సిద్ధాంతం’’గా పిలుస్తారు. ఇప్పటికీ ఇదే సిద్ధాంతాన్ని ఇరాన్‌కి ఇజ్రాయిల్ వర్తింపచేస్తోంది.