Israel: ఇజ్రాయిల్-హమాస్ వార్ ప్రారంభమైనప్పటికీ నుంచి పలువురు జర్నలిస్టులు రిపోర్టింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే, ఆరుగురు ‘అల్ జజీరా’ జర్నలిస్టులకు పాలస్తీనా తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఇజ్రాయిల్ సైన్యం ఆరోపించింది. వీరికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని నిరూపించే గూఢచారం సమాచారం, పత్రాలు, టెర్రరిస్ట్ శిక్షణ సంబంధించిన వివరాలు దొరికినట్లు ఇజ్రాయిల్ బుధవారం ఒక ట్వీట్‌లో చెప్పింది. ‘‘ ఖతార్‌కి చెందిన అల్ జజీరా మీడియా నెట్‌వర్క్‌కి హమాస్ ఉగ్రవాదుల సంబంధం ఉందని ఈ పత్రాలు రుజువు చేస్తాయి.’’ అని బుధవారం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ట్వీట్‌లో పేర్కొంది. అల్ జజీరా హమాస్ ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నట్లు, ఈ మీడియాకు సంబంధించి చాలా మంది జర్నలిస్టులు హమాస్ కార్యకర్తలుగా ఉన్నారని మిలిటరీ పేర్కొంది.
Read Also: Bengaluru Traffic: బెంగళూరులో ట్రాఫిక్ జామ్.. వాహనాలను వదిలేసి నడిచి వెళ్లిన ప్రయాణికులు
ఐడీఎఫ్ ప్రకారం.. అల్ జజీరా జర్నలిస్టులు అనస్ అల్-షరీఫ్, హోసామ్ షబాత్, ఇస్మాయిల్ అబు ఒమర్ మరియు తలాల్ అర్రూకీలకు హమాస్‌తో సంబంధాలు ఉన్నాయని, అష్రఫ్ సరాజ్, అలా సలామెహ్ మరో ఉగ్రసంస్థ ఇస్లామిక్ జిహాద్‌తో సంబంధం కలిగి ఉన్నట్లు పేర్కొంది. అయితే, ఇజ్రాయిల్ ఆరోపణల్ని అల్ జజీరా తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయిల్ దళాలు తమ జర్నలిస్టుల్ని ఉగ్రవాదులుగా చిత్రీకరించడాన్ని ఖండిస్తున్నట్లు, ఖల్పిత సాక్ష్యాలను ఉపయోగించినట్లు పేర్కొంది. గాజా, పాలస్తీనా ప్రాంతంలో కొద్ది మంది జర్నలిస్టుల్ని అణిచివేసే ప్రయత్నమని, యుద్ధంలోని వాస్తవాలు ప్రపంచానికి తెలియకుండా ఇజ్రాయిల్ ప్రయత్నిస్తోందని చెప్పింది.
అయితే, ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడాన్ని అమెరికాకు చెందిన జర్నలిస్టులకు సంబంధించిన కమిటీ తప్పుపట్టింది. అల్ జజీరా ప్రకారం, అక్టోబర్ 2023లో యుద్ధం చెలరేగినప్పటి నుండి గాజాలో ఇజ్రాయెల్ దాడుల వల్ల తమజర్నలిస్టులు నలుగురు మరణించినట్లు చెప్పింది.జాతీయ భద్రత దృష్ట్యా ఇటీవల జెరూసలేంలో ఉన్న అల్ జజీరా కార్యాలయాన్ని ఇజ్రాయిల్ మూసివేయించింది. మొత్తంగా ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గాజా, వెస్ట్ బ్యాంక్, లెబనాన్, ఇజ్రాయిల్‌లో 128 మంది జర్నలిస్టులు చంపబడ్డారు. బాధితుల్లో ఎక్కువ మంది అంటే, 123 మంది పాలస్తీనియన్లు ఉన్నారు. ఇద్దరు ఇజ్రాయిలీలు, ముగ్గురు లెబనీస్ ఉన్నారు.