Iran: ఇజ్రాయిల్, ఇరాన్ దేశాలు ఉప్పూనిప్పుగా ఉంటాయి. ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వం పెరుగుతూనే ఉంది. ఇరాన్ అణుకార్యక్రమాలు చేపడుతుందని ఆ దేశ కీలక సైంటిస్టులను ఇజ్రాయిల్ లేపిసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇరాన్ దేశ కీలక కమాండర్ ఖాసిం సులేమానీని కూడా బాంబు దాడిలో హతమర్చారు. ఈ ఘటనకు ఇజ్రాయిల్ కారణమని పలు వేదికలపై ఇరాన్ ఆరోపింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం గాజా యుద్ధంలో హమాస్ నేతలకు ఇరాన్ సాయపడుతుందని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. అక్టోబర్ 7 నాటి దాడిలో హమాస్ వెనక ఇరాన్ హస్తముందని ఇజ్రాయిల్ ప్రధాన ఆరోపణ. ఇక హిజ్బుల్లా, హౌతీ తిరుగుబాటుదారులకు కూడా ఇరాన్ మద్దతు ఉందని పాశ్చాత్యదేశాలు ఆరోపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ గూఢచార సంస్థ మొసాద్ ఏజెంట్‌ని ఇరాన్ ఉరితీసినట్లు తెలుస్తోంది. ఇరాన్ ఆగ్నేయ సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్సులో మొసాద్ ఏజెంట్‌ని శనివారం ఉరితీసింది. ఉరితీయబడిన వ్యక్తి విదేశాలకు సాయపడుతున్నాడని, ప్రత్యేకం మొసాద్ తో సంబంధాలు ఉన్నాయని, రహస్య సమాచారాన్ని సేకరించి, మొసాద్‌తో పాటు ఇతర విదేశీ సంస్థలకు అందిస్తు్న్నాడంటూ ఇరాన్ ఆరోపించింది. అయితే ఉరితీయబడిన వ్యక్తి పేరును బయటపెట్టలేదు.
ఇస్లామిక్ రిపబ్లిక్‌కి వ్యతిరేకంగా ఉన్న గ్రూపులకు, సంస్థలకు నిందితుడు రహస్య సమాచారాన్ని చేరవేసినట్లు ఇరాన్ పేర్కొంది. అయితే సదరు వ్యక్తి వివరాలు, ఎప్పుడు, ఎక్కడ అరెస్ట్ చేయబడ్డాడన్న వివరాలపై స్పష్టత లేదు. సిస్తాన్-బలూచిస్తాన్ లోని జహెదాన్ జైలులో ఉరిశిక్షను అమలు చేశారు. బలూచ్ లోని ఉగ్రవాదులు ఒక పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి 11 మంది భద్రతా సిబ్బందిని చంపేసిన తర్వాతి రోజే ఈ ఉరి అమలు చేయబడింది. ఆఫ్ఘన్-పాకిస్తాన్-ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రావిన్సుల్లో తరుచుగా భద్రతా బలగాలకు, సున్నీ తీవ్రవాదులకు ఘర్షణలు చోటు చేసుకుంటాయి. ఈ ప్రాంతంలో సున్నీ ముస్లింలు ఎక్కువగా ఉన్నారు, ఇరాన్ వ్యాప్తంగా చూసుకుంటే షియా ముస్లింలు అధికం. వారి చేతిలోనే అధికారం ఉంటుంది.