INDIA bloc: బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో ఇండియా కూటమిపై అడిగిన ప్రశ్న ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీనిపై సీఎం నితీష్ కుమార్‌పై బీజేపీ విమర్శలకు దిగింది. ఈ వ్యవహారం బీహార్‌లో రాజకీయ దుమారాన్ని రేపింది. ఇటీవల నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో ‘‘ఇండియా’’ కూటమి పేరును విస్తరించాలని కోరింది.
Read Also: Rajasthan: నిర్భయ తరహా ఘటన.. కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.
శుక్రవారం నిర్వహించిన టీచర్ల రిక్రూట్మెంట్ పరీక్ష జనరల్ స్టడీస్ ప్రశ్నాపత్రంలో ఈ ప్రశ్న కనిపించింది. ఈ పరిణామంపై బీజేపీ అధికార ప్రతినిధి అరవింద్ సింగ్ స్పందిస్తూ.. ఇండియా కూటమిని ‘‘ ప్రతిపక్షాల కూటమి దుండగుల సమూహం’’ అని విమర్శించారు. ఇండియా కూటమిలో ప్రస్తుతం జేడీయూ చీఫ్, సీఎం నితీష్ కుమార్ కీలక సభ్యుడిగా ఉన్నారు. అయితే దీనిపై కాంగ్రెస్ నాయకుడు అసిత్ నాథ్ తివారీ మాట్లాడుతూ.. ఇలాంటి ప్రశ్న పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధం చేస్తుందని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.
“ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్”, దీనిని ఇండియా కూటమిగా వ్యవహరిస్తున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీని అడ్డుకునేందుకు కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ, టీఎంసీ, శివసేన(ఉద్ధవ్), ఆప్ వంటి పార్టీలు కలిసి ఇండియా పేరుతో కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. దీని మొదటి సమావేశం నితీష్ కుమార్ అధ్యక్షతన పాట్నాలో జరిగింది.