పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్ పై ప్రశంసల జల్లు కురిపించారు. పెట్రోల్ రేట్లను పాకిస్తాన్ ప్రభుత్వం పెంచుతోందన విమర్శిస్తూ…
భారత్ పెట్రోల్ రేట్లు తగ్గించడంపై ప్రశంసలు కురిపించారు. పాక్ లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పెట్రోల్, డిజిల్ పై రూ. 30 చొప్పున పెంచడంపై ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను ప్రధానిగా ఉన్న సమయంలో రష్యా నుంచి 30 శాతం చవకైన చమురు కోసం ఒప్పందం చేసుకున్నామని… కొత్తగా ఏర్పడిన షెహబాజ్ ప్రభుత్వం మాత్రం రేట్లను విపరీతంగా పెంచుతోందని విమర్శించారు. అమెరికా మిత్రదేశం అయినప్పటికీ.. భారత్ రష్యా నుంచి చవకగా చమురును దిగుమతి చేసుకుంటుందని.. పెట్రోల్, డిజిల్ పై రూ. 25 (పాక్ రూపాయల్లో) తగ్గించిందని భారత్ ను కొనియాడారు.
దేశంలోని దిగుమతి చేసుకున్న ప్రభుత్వ.. తమ విదేశీ యజమానులకు ధర చెల్లించడం ప్రారంభించిందంటూ సెటైర్లు వేస్తూ.. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్, డిజిల్ ధరలు పెంచారంటూ పాక్ ప్రభుత్వాన్ని నిందించారు. ఇప్పుడు మనదేశం మోసగాళ్ల పాలనలో ఉందని… తీవ్రమైన ద్రవ్యోల్బన పరిస్థితులు ఎదుర్కొంటోందని ట్వీట్స్ చేశారు. ఇదిలా ఉంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) సంస్కరణల్లో భాగంగా పాకిస్తాన్ ఈ ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పాకిస్తాన్ మరో శ్రీలంక కావడానికి మరికొన్ని అడుగుల దూరంలో మాత్రమే ఉంది. ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావం ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో ఎడాపెడా రేట్లను పెంచుతోంది. ధరలు పెంచడం మినహా ప్రభుత్వం దగ్గర మరో మార్గం లేదని పాక్ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ వెల్లడించారు. ప్రస్తుతం పాక్ కరెన్సీలో లీటర్ పెట్రోల్ ధర ర. 179.86, డిజిల్ ధర రూ. 174.15గా ఉంది.