ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరు పక్షాలు భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి. క్షిపణుల ప్రయోగాలతో ఇరు దేశాల్లోనూ ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. తాజాగా ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలోని నగర నివాసితులంతా ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం సూచించింది. ఇరాన్‌లోని అరక్, ఖోండాబ్ నగర ప్రజలకు ఐడీఎఫ్ హెచ్చరికలు జారీ చేసింది. సొంత భద్రత కోసం ఆ ప్రాంతాలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని కోరింది. ఫార్సీలో విడుదల చేసిన ఒక ప్రకటనలో ఐడీఎఫ్ తెలిపింది. ఇరానియన్ సైనిక ఆస్తులను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Oneplus Store : గిట్లకూడ ఉంటదా..? రిపేర్‌కు ఇచ్చిన ఫోన్ తిరిగివ్వమంటే కస్టమర్లకు బెదరింపులు..
ఇదిలా ఉంటే ఈ వారాంతంలోనే అమెరికా కూడా ఇరాన్‌పై దాడులకు దిగొచ్చని నివేదికలు అందుతున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రణాళికకు కూడా ట్రంప్ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదిక పేర్కొంది. రాబోయే రోజుల్లో ఇరాన్‌పై అమెరికా విరుచుకుపడొచ్చని తెలిపింది. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా దాడులు జరగొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం సమీప నగరాలను ఇజ్రాయెల్ సైన్యం ఖాళీ చేయమని హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: Space x: టెస్టింగ్ సమయంలోనే పేలిపోయిన స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్
ప్రస్తుతం ఇరాన్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఇజ్రాయెల్ సైన్యం ఇంటర్నెట్ సేవలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించడంతో ఇరాన్ ప్రభుత్వం సేవలను నిలిపివేసింది. దీంతో దాదాపుగా 12 గంటల నుంచి ఇంటర్నెట్ సేవలు అందడం లేదు.
ఇక తాజాగా ఇరాన్ ప్రయోగించిన క్షిపణి దాడిలో ఇజ్రాయెల్‌లో పెద్ద ఆస్పత్రి ధ్వంసం అయింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఇజ్రాయెల్ తెలిపింది. ముందుగానే ఖాళీ చేయించడంతో ప్రమాదం తప్పిందని పేర్కొంది.