స్మార్ట్ఫోన్లు వచ్చాక సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో విడదీయరాని భాగమైపోయింది. నిమిషం కూడా మొబైల్‌ను వదిలి ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఇష్టమైన ప్లాట్ఫార్మ్ను ఓపెన్ చేసి గంటల తరబడి రీల్స్, వీడియోలు స్క్రోల్ చేస్తూ లైక్‌లు, కామెంట్లు చేయడం సాధారణంగా మారింది. అయితే ఇదే అలవాటు టర్కీలోని ఒక వ్యక్తిని కోర్టు వరకూ తీసుకెళ్లింది.
టర్కీకి చెందిన ఓ వ్యక్తి తన భార్య ముందే సోషల్ మీడియాలో ఇతర మహిళల ఫోటోలను చూసి లైక్‌లు చేశాడు. ఇది భరించలేని భార్య కోర్టులో కేసు దాఖలు చేసింది. విచారణ చేపట్టిన టర్కీ సివిల్ కోర్టు, భర్త సోషల్ మీడియా అకౌంట్లు పరిశీలించి భార్య ఆరోపణలు నిజమేనని తేల్చింది. దీంతో భర్తకు లక్షా డెబ్బై వేల పరిహారం చెల్లించడంతో పాటు నెలవారీ జీవనాధారం అందించాలని కోర్ట్ ఉత్తర్వులు ఇచ్చింది.
భార్య పక్కనే ఉండి ఇతర మహిళల ఫోటోలకు లైక్‌లు చేయడం నేరుగా వివాహేతర సంబంధం కాకపోయినా, అది మానసిక వేధింపుగా పరిగణించవచ్చని స్పష్టం చేశారు జడ్జి స్పష్టం చేశారు. దాంపత్య బంధంలో నమ్మకాన్ని దెబ్బతీసే ఇలాంటి ప్రవర్తనను తేలికగా తీసుకోవద్దని హెచ్చరించారు.
తీర్పు అనంతరం భార్య—భర్త ప్రవర్తనతో తీవ్ర మనస్తాపం చెంది కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొంది. తన ఎదుటే ఇతర మహిళల ఫోటోలను చూస్తూ లైక్‌లు కొడతుండడం వల్ల తన ఆత్మగౌరవం దెబ్బతిన్నదని ఆ మహిళ చెప్పుకొచ్చింది. దీంతో తనకు దాంపత్య బంధంలో పూర్తిగా నమ్మకం పోయిందని కన్నీరు పెట్టుకుంది.