Israel-Hamas: ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి ఒప్పందాన్ని మరో 4 రోజులు పొడగించేందుకు హమాస్ సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయిల్ నుంచి పాలస్తీనా ఖైదీలను, హమాస్ నుంచి ఇజ్రాయిలీ బందీలను విడుదల చేయడానికి మార్గం సుగమమైంది. సంధి పొడగింపుపై మధ్యవర్తులు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆరు వారాల యుద్ధం తర్వాత గత శుక్రవారం నుంచి నాలుగు రోజుల సంధి అమలులోకి వచ్చింది. దీనిని మరో రెండు రోజులు పొడగించారు, ప్రస్తుతం సంధి గురువారంతో ముగుస్తుంది. ఈనేపథ్యంలోనే మరింత కాలం సంధిని పొడగించాలని హమాస్, ఇజ్రాయిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే తమ వద్ద ఉన్న 240 మంది బందీల్లో 60 మందిని హమాస్ వదిలిపెట్టింది. మరోవైపు ఇజ్రాయిల్ 180 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అయితే మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్ స్థిరమైన కాల్పుల విరమణ కోసం కృషి చేస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు హమాస్ బందీలుగా ఉన్న పిల్లల్ని, మహిళల్ని విడుదల చేసింది, ఈసారి పురుషులతో పాటు పట్టుబడిన సైనికులను విడిపించుకునేలా డీల్ కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది.
Read Also: Kiraak RP: ఐఏఎస్ అవ్వాల్సిన అమ్మాయితో లవ్.. సీక్రెట్ గా పెళ్లాడిన కిరాక్ ఆర్పీ
ఇప్పటికే అమెరికా సీఐఏ, ఇజ్రాయిల్ మొసాద్ అధికారులు దోహాలో ఖతార్ ప్రధానిని కలుసుకున్నారు. ఈ భేటీలో ఈ సంధిని మరిన్ని రోజులు పొడగించేందుకు చర్చించారు. దీనికి ముందు ఖతార్ మధ్యవర్తులు హమాస్ అధికారులను కలిశారు. అయితే ఈ చర్చల్లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనే దానిపై స్పష్టత లేదు.
అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని హతమార్చింది. 240 మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లింది. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాపై భీకరంగా దాడి చేసింది. ఈ దాడిలో 16000 మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో చాలా మంది పిల్లుల ఉండటంతో ప్రపంచదేశాలు కాల్పుల విరమణ పాటించాలని, సంధి కుదుర్చుకోవాలని ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తీసుకువచ్చాయి.