జర్మనీలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్.. ఆర్థిక మంత్రి క్రిస్టియన్ లిండర్న్‌ను తొలగించారు. దీంతో బుధవారం సంకీర్ణ ప్రభుత్వం పడిపోయింది. దేశానికి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో లిండర్న్ ద్రోహం చేసినట్లుగా ఓలాఫ్ భావించారు. దీంతో ఆయన్ను హఠాత్తుగా పదవి నుంచి తప్పించారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా ప్రభుత్వం కూలిపోయింది. త్వరలోనే మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. తమ ప్రభుత్వానికి పార్లమెంట్‌లో మెజారిటీ లేనందున వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రభుత్వంపై విశ్వాస పరీక్ష నిర్వహించనున్నట్లు ఓలాఫ్ వెల్లడించారు.
దేశాన్ని రక్షించడం కొరకే క్రిస్టియన్ లిండ్నర్‌ను తొలగించినట్లు స్కోల్జ్ టెలివిజన్ ప్రసంగంలో తెలియజేశారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన స్కోల్జ్, ఫ్రీ డెమోక్రటిక్ పార్టీకి చెందిన లిండ్నర్, గ్రీన్ పార్టీకి చెందిన రాబర్ట్ హబెక్ మధ్య రోజుల తరబడి రాజకీయ గందరగోళం నెలకొంది. మరోవైపు జర్మనీ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ఈ పరిణామాల మధ్య సంకీర్ణ ప్రభుత్వ నాయకుల సంభాషణ తీవ్ర ఆనిశ్చితికి దారి తీసింది. పరిస్థితులు ఇబ్బందికరంగా మారడంతో లిండ్నర్‌ను తొలగించారు. అనంతరం ప్రభుత్వం కూలిపోయింది.
ఇది కూడా చదవండి: Ponguleti Srinivas Reddy: రాబోయే స్థానిక ఎన్నికల వరకు అన్ని పథకాలు ఇచ్చి తీరుతాం..
జనవరి 15న విశ్వాస ఓటు వేయనున్నానని, వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా ఎన్నికలను నిర్వహించవచ్చని స్కోల్జ్ చెప్పారు. జనవరి 15 వరకు పదవిలో ఉంటానని పేర్కొన్నారు. అత్యంత ముఖ్యమైన చట్టాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తానని, ఆర్థిక వ్యవస్థ మరియు రక్షణకు సంబంధించిన చట్టాలను ఆమోదించడానికి క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్, ప్రతిపక్ష నాయకుడు ఫ్రెడరిక్ మెర్జ్‌తో మాట్లాడతానని స్కోల్జ్ తెలిపారు.
వాస్తవానికి జర్మనీ ఎన్నికలు 2025, సెప్టెంబర్‌లో జరగాల్సి ఉంది. కానీ ప్రభుత్వం కూలిపోవడంతో ముందుగానే ఎన్నికలు రానున్నాయి. 2005లో ముందస్తు ఎన్నికలు జరిగాయి. మరోసారి ముందస్తు ఎన్నికలు అనివార్యమయ్యాయి.
ఇది కూడా చదవండి: Central America: గాల్లో ఉన్న విమానం డోర్ తెరిచేందుకు యత్నించిన వ్యక్తి.. ఏం జరిగిందంటే? (వీడియో)