First Ship With Ukraine Grain Leaves Odessa After Deal To Ease Food Crisis: రష్యా దురాక్రమణ నేపథ్యంలో.. ఉక్రెయిన్ నుంచి ఫిబ్రవరి నెల నుంచి ప్రపంచ దేశాలకు లక్షలాది టన్నుల ఆహార ధాన్యాల ఎగుమతులు నిలిచిపోయాయి. ఈ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ఆహార సంక్షోభం నెలకొనడంతో.. ఐక్యరాజ్య సమితి (UN), తుర్కియేలు రంగంలోకి దిగాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు కసరత్తు చేస్తూ వచ్చాయి. పలు దఫాల చర్చల అనంతరం ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల సరకు నౌకల రవాణాకు రష్యా అంగీకరించింది. ఈ క్రమంలోనే గత నెల 22వ తేదీన ఆహార ధాన్యాలు, ఎరువుల ఎగుమతుల పునఃప్రారంభానికి ఐరాస, తుర్కియేలతో రష్యా, ఉక్రెయిన్‌లు వేర్వేరుగా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
ఫలితంగా.. ఉక్రెయిన్ నుంచి సముద్ర మార్గం ద్వారా ఆహార ధాన్యాల ఎగుమతులు ప్రారంభమయ్యాయి. 26,000 టన్నుల మొక్కజొన్నలతో నిండిన మొదటి రవాణా నౌక.. సోమవారం ఉక్రెయిన్‌లోని ఒడెస్సా నౌకాశ్రయం నుంచి బయల్దేరింది. లెబనాన్‌లోని ట్రిపోలీకి బయలుదేరిన ఈ నౌక.. ఆగస్టు 2వ తేదీ నాటికి ఇస్తాంబుల్‌కు చేరుకుంటుంది. అక్కడ తనిఖీలు నిర్వహించాక, ఆ నౌక తన ప్రయాణాన్ని కొనసాగించనుందని తుర్కియే రక్షణ శాఖ వెల్లడించింది. కాగా.. గోధుమలు, బార్లీ, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు నూనెల ఎగుమతుల్లో ఉక్రెయిన్, రష్యా అగ్రగాములుగా కొనసాగుతున్న విషయం విదితమే. యుద్ధం నేపథ్యంలో ఎగుమతులు స్తంభించిపోయాయి. ఇప్పుడు తాజా ఒప్పందంతో.. 2.2 కోట్ల టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల అంతర్జాతీయ రవాణాకు మార్గం సుగమమైంది.