Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. వాషింగ్టన్ పోస్ట్ ద్వారా లీక్ అయిన యూఎస్ ఇంటెలిజెన్స్ పత్రాల్లో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మిడిల్ ఈస్ట్ లో అమెరికాకు మిత్రదేశంగా ఉన్న ఈజిప్టు, రష్యాకు సాయం చేసేందుకు సిద్ధం అయినట్లు పత్రాల ద్వారా వెల్లడైంది. ఈజిప్టు రహస్యంగా దాదాపుగా 40,000 రాకెట్లను ఉత్పత్తి చేసి రష్యాకు సరఫరా చేయాలని ప్లాన్ వేసింది. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతేహ్ ఎల్-సిసి తన ఉన్నత సైనిక అధికారులతో సమావేశాన్ని నిర్వహించారని, అందులో రష్యాకు ఫిరంగి గుండ్లు మరియు గన్‌పౌడర్‌లను అందించడంపై చర్చించారని కూడా అవుట్ లెట్ తెలిపింది.
Read Also: Nachinavadu Teaser: ప్రపంచంలో పెళ్లి కానీ వెధవలు చాలామంది ఉన్నారు
బయటపడిన ఈ రహస్య పత్రాలు ఫిబ్రవరి 17 నాటివిగా వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. ఈ పరిణామాలు అమెరికా అధికారులు, రాజకీయ నాయకులకు మింగుడుపడటం లేదు. ఈజిప్టు నిజంగా రష్యాకు ఇవ్వడానికి రాకెట్లను ఉత్పత్తి చేసుంటే మా సంబంధాలను పున:సమీక్షించుకోవాల్సి ఉంటుందని కనెక్టికట్ కు చెందిన జూనియర్ సెనెటర్ క్రిస్ మర్ఫి అన్నారు. అయితే యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ జనవరి చివరిలో ఈజిప్టులో పర్యటించారు. ఈ సమయంలో ఎల్-సిసితో ఆయన సమావేశం అయ్యారు. ఆ సమయంలో ఉక్రెయిన్ యుద్ధం వల్ల తీవ్ర ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటున్న ఈజిప్టుకు అమెరికా సంఘీభావం తెలుపుతోందని బ్లింకెన్ అన్నారు. ఇప్పటికే ఇరాన్ రష్యాకు అత్యంత శక్తివంతమైన డ్రోన్లను సరఫరా చేస్తోంది. ఈ డ్రోన్ల సాయంతో రష్యా, ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది.