Drone Strike: హిందూ మహా సముద్రంలోని ఓ వ్యాపార నౌకపై డ్రోన్ దాడి జరిగింది. డ్రోన్ దాడితో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. లైబీరియా జెండాతో ఉన్న ట్యాంకర్ ఇజ్రాయిల్ అనుబంధంగా ఉందని తెలుస్తోంది.
అయితే ఇప్పటి వరకు ఈ దాడికి తామే పాల్పడినట్లు ఏ సంస్థ కూడా బాధ్యత ప్రకటించుకోలేదు. బ్రిటీష్ మిలిటరీకి చెందిన యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ మరియు సముద్ర భద్రతా సంస్థ ఆంబ్రే ప్రకారం, భారతదేశ తీర ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. యునైటెడ్ కింగ్‌స్టన్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్.. ఈ దాడి అన్‌క్రూడ్ ఏరియల్ సిస్టమ్ ద్వారా జరిగిందని పేర్కొంది. దీనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది.
ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో ఇజ్రాయిల్ నుంచి వచ్చే నౌకల్ని లేకపోతే ఇజ్రాయిల్ అనుబంధంగా పనిచేస్తున్న నౌకల్ని యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులు టార్గెట్ చేస్తున్నారు. హౌతీ తిరుగుబాటుదారులకు మద్దతుగా ఇరాన్ వ్యవహరిస్తోందని అమెరికాతో పాటు పలు వెస్ట్రన్ దేశాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా ఘటన గుజరాత్ రాష్ట్రంలోని వెరావల్‌కి నైరుతి దిశలో 200 కిలోమీటర్ల దూరంలో జరిగింది.