Wrestler Virender Singh: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) వివాదం కొనసాగుతోంది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, సన్నిహితుడు సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ కావడాన్ని రెజ్లర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఏస్ రెజ్లర్ సాక్షిమాలిక్ సంజయ్ సింగ్ ఎన్నికపై కన్నీటిపర్యంతమయ్యారు. తాను రెజ్లింగ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మరోవైపు మరో రెజ్లర్ బజరంగ్ పునియా తన పద్మశ్రీని ప్రధాని నరేంద్రమోడీకి వాపస్ చేస్తున్నట్లు ప్రకటించారు.
తాజాగా రెజ్లర్ వీరేందర్ సింగ్, సాక్షి మాలిక్‌కి మద్దతు తెలిపారు. ‘‘నేను నా సోదరి, ఈ దేశ బిడ్డ సాక్షి మాలిక్, ప్రధాని నరేంద్రమోడీ జీ కోసం తన పద్మశ్రీని తిరిగి ఇస్తాను. నేను సాక్షిమాలిక్ గురించి గర్వపడుతున్నాను. మిగతా అగ్రశ్రేణి క్రీడాకారులు కూడా తమ నిర్ణయాన్ని ప్రకటించాలి’’ అని సచిన్ టెండూల్కర్, నీరజ్ చోప్రాలను ట్యాగ్ చేస్తూ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
Read Also: Heater Incident: హీటర్‌లో మంటలు.. తండ్రి, 3 నెలల కూతురు సజీవదహనం..
తాను ప్రధాని మోడీకి లేఖ రాశానని, తనకు ఇచ్చిన పద్మశ్రీని తిరిగి ఇస్తానని శుక్రవారం రెజ్లర్ బజరంగ్ పునియా తెలిపిన మరుసటి రోజే వీరేందర్ సింగ్ ఈ నిర్ణయం ప్రకటించారు. ఢిల్లీలోని కర్తవ్య పథ్‌కి చేరుకున్న పునియా అక్కడ ఫుట్‌పాత్‌పై పద్మశ్రీ పతకాన్ని ఉంచారు, దీనిని ఆ తర్వాత పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
‘‘మహిళా రెజ్లర్లకు తగిన గౌరవం ఇవ్వనప్పుడు నాకు కూడా గౌరవం దక్కదు.. 40 రోజులుగా రోడ్డున పడ్డాం.. కానీ ప్రభుత్వం తన హామీలను నెరవేర్చలేదు. మా పోరాటం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. నేను న్యాయవ్యవస్థను నమ్ముతాను. కానీ జరుగుతున్న పరిణామాల వల్ల నేను వ్యవస్థపై విశ్వాసం ఉంచలేను’’ అని పునియా శుక్రవారం అన్నారు.
ఒలింపిక్స్ లో పతకం సాధించిన భారత తొలి బాక్సర్ విజేందర్ సింగ్ కూడా నిన్న సాక్షిమాలిక్‌కి మద్దతు తెలిపారు. ‘‘ఒలింపిక్ పతక విజేతకు న్యాయం జరగకపోతే, మాకు ఎలా న్యాయం జరుగుతుందని కుమార్తెల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రపతి, ప్రధాని అందరూ ఇలా ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలి. న్యాయవ్యవస్థ, ప్రజాస్వామ్య నిర్మాణంపై ఇది చాలా ప్రశ్నల్ని లేవనెత్తుతోంది.’’ అని ఆయన అన్నారు.