కరోనా మహమ్మారి నుంచి ప్రపంచదేశాలు ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాయి. అలాగని ఇది పూర్తిగా కనుమరుగవ్వలేదు. ఇంకా కొన్ని దేశాల్లో దీని ఉధృతి కొనసాగుతోంది. కాకపోతే, పరిస్థితి మునుపటిలా మరీ తీవ్రంగా అయితే లేదు. ఇంతలో మంకీపాక్స్ వైరస్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. పలు దేశాల్లో ఈ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వ్యాప్తి కూడా వేగంగా జరుగుతోంది. దీంతో, ఇది మరో కరోనా మహమ్మారి కానుందా? భారీ స్థాయిలో మరణాలు సంభవిస్తాయా? లాక్డౌన్ లాంటి పరిస్థితులు వస్తాయా? అనే భయాందోళనలు రేకెత్తుతున్నాయి.
అయితే.. అలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డా. ఫహీమ్ క్లారిటీ ఇచ్చారు. కరోనా తరహాలో ఈ మంకీపాక్స్ వైరస్ వ్యాపించే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. మంకీపాక్స్ కేసులు ఆందోళన కలిగిస్తోన్న విషయం వాస్తవమే కానీ, కరోనా వైరల్‌లా మారే అవకాశం సున్నా శాతమని వెల్లడించారు. ఇది కొవిడ్ తరహాలో పుట్టుకొచ్చిన కొత్త వైరస్ కాదని, అంత ప్రమాదకారి కాదని తెలిపారు. మశూచి మాదిరి మంకీపాక్స్ కూడా ఆ కుటుంబానికి చెందిందేనని పేర్కొన్నారు. ఇది గాలి ద్వారా వ్యాపించదని, కరోనాతో పోలిస్తే వ్యాప్తి తక్కువని చెప్పారు. మశూచి టీకాతో దీన్ని నయం చేయొచ్చని ఫహీమ్ స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం క్వాడ్ సమావేశంలో కరోనా తరహాలో మంకీపాక్స్ వ్యాపించబోదని అన్నారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసులు వందేనని.. పశ్చిమ ఆఫ్రికాలో మొదలైన ఈ వైరల్ ఇప్పుడు అమెరికా, బ్రిటిన్‌లలోనూ వెలుగుచూసిందని చెప్పారు. మశూచి టీకాతో దీన్ని అడ్డుకోవచ్చని పేర్కొన్నారు.