Donald Trump: ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఘర్షణ 5వ రోజుకు చేరుకుంది. ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ కారణంగా మధ్యప్రాచ్యంతో పాటు ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతోంది. ఇదిలా ఉంటే, ఈ ఘర్షణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వానికి విరామం అవసరం లేదని చెప్పారు. ‘‘మేము కాల్పుల విరమణ కన్న మెరుగైన దానిని చూస్తున్నాము’’ అని విలేకరులతో అన్నారు. ‘‘కాల్పులు విరమణ కాదు, శాశ్వత ముగింపు’’ అని అన్నారు.
Read Also: Deputy CM Bhatti: అర్హులైన రైతులందరికీ రైతు భరోసా డబ్బులు పడతాయి..
రెండు దేశాల ఘర్షణ వల్ల 200 మందికి పైగా ప్రజలు చనిపోయారు. చమురు మార్కెట్లు ఈ ఘర్షణ వల్ల తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో, రెండు దేశాల మధ్య శత్రుత్వానికి శాశ్వత ముగింపు ఉండాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అమెరికా వైఖరి, ఇజ్రాయిల్‌కు అందించిన సహాయం గురించి ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘ ప్రస్తుతం, మేము చాలా బాగానే ఉన్నాము. గుర్తుంచుకోండి, ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండకూడదు’’ అని అన్నారు.
ఇదిలా ఉంటే, కెనడాలో జరుగుతున్న జీ 7 శిఖరాగ్ర సమావేశం నుంచి ట్రంప్ ముందుగానే అమెరికాకు తిరిగి వచ్చారు. ఆయన అమెరికా వెళ్లడంపై ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. కాల్పుల విరమణ కోసం ట్రంప్ వెళ్లినట్లు చెప్పారు. అయితే, మక్రాన్ వ్యాఖ్యల్ని ట్రంప్ కొట్టిపారేశారు. ‘‘నేను ఎందుకు వాషింగ్టన్ వెళ్తున్నానో మక్రాన్‌కి తెలియదు. కాల్పుల విరమణతో ఖచ్చితంగా సంబంధం లేదు. దాని కన్నా పెద్దది’’ అని ట్రంప్ అన్నారు.