Covid Was Man-Made Virus, Says Wuhan Lab Scientist In New Book: గత మూడేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది కోవిడ్ -19. చైనా వూహాన్ నగరంలో ప్రారంభం అయిన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరించింది. కరోనా వైరస్ వల్ల పలు దేశాల ఆర్థిక వ్యవస్థలతో పాటు ఆరోగ్య వ్యవస్థలను సర్వనాశనం చేసింది. లక్షల సంఖ్యలో ప్రజల్ని బలి తీసుకుంది. ఇప్పటీకీ దాని ప్రభావం తగ్గలేదు. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా.. వ్యాధి తన రూపాన్ని మార్చుకుంటూ ప్రజలపై దాడి చేస్తూనే ఉంది. ఇకపై కోవిడ్-19తో సహజీవనం చేయాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. కరోనా వైరస్ ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్, మళ్లీ ఓమిక్రాన్ లో సబ్ వేరియంట్లుగా రూపాంతరం చెందుతూనే ప్రజలపై దాడి చేస్తోంది.
ఇదిలా ఉంటే యూఎస్ఏకు చెందిన సైంటిస్టు ఆండ్రూ హఫ్ సంచలన విషయాన్ని వెల్లడించారు. తాను రాసిన తాజా పుస్తకం ‘‘ది ట్రూత్ అబౌట్ వుహాన్’’ అనే పుస్తకంలో ఈ విషయాలను తెలియజేశారు. కోవిడ్-19 ‘‘ మానన నిర్మిత వైరస్’’ అని అన్నారు. రెండేళ్ల క్రితం ప్రభుత్వ నిర్వహణలో, ప్రభుత్వ నిధులతో పనిచేస్తున్న పరిశోధనా కేంద్రం వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యుఐవి) లీక్ అయిందని.. ఆండ్రూ హఫ్ పుస్తకాన్ని ఉటంకిస్తూ న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. గతంలో ఆండ్రూ హఫ్ వ్యూహాన్ ల్యాబులో పనిచేశారు.
Read Also: Kalva Srinivasulu:రాయలసీమకు తీరని అన్యాయం చేసింది జగనే
చైనా లాభాపేక్ష కారణంగా తగినంత భద్రత లేని కారణంగా కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచి లీక్ అయిందని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. మొదటి నుంచి కరోనా వైరస్ మూలాలకు వూహాన్ ల్యాబ్ కేంద్రంగా ఉంది. ప్రపంచదేశాలు కూడా వూహాన్ ల్యాబుపై అనుమానాలు వ్యక్తం చేశాయి. అయితే ప్రపంచదేశాలు చేసిన విమర్శలను చైనా అధికారులు ఖండించారు. సరైన బయో సెక్యురిటీ, రిస్క్ మేనేజ్మెంట్ నియంత్రణ చర్యలు లేవు.. అందుకనే ల్యాబ్ నుంచి వైరస్ లీక్ కు దారి తీసిందని ఆండ్రూ హఫ్ తన పుస్తకంలో పేర్కొన్నారు.
దశాబ్ధకాలానికి పైగా ఈ వూహాన్ ల్యాబ్ కేంద్రంగా చైనా ప్రభుత్వం ఇచ్చే నిధులతో గబ్బిలాలలో అనేక కరోనా వైరస్లపై అధ్యయనం చేస్తోంది. కరోనా వైరస్ జన్యుపరంగా ఇంజనీరింగ్ చేయబడిన వైరస్ అని తనకు మొదటి నుంచి తెలుసు అని హఫ్ తన పుస్తకంలో రాశారు. 2014 నుంచి 2016 వరకు అమెరికాకు చెందిన ఎకో హెల్త్ అలయెన్స్ లో పనిచేశారు హఫ్. అయితే ఈ సమయంలో కరోనా వైరస్ సృష్టించడంలో అనేక పద్దతులను అభివృద్ధి చేయడానికి ఈ సంస్థ వూహాన్ ల్యాబుకు సహకరించిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదకరమైన టెక్నాలజీని చైనీయులకు బదిలీ చేయడానికి యూఎస్ ప్రభుత్వమే కారణం అని చెప్పవచ్చని వెల్లడించారు.