Gurpatwant Singh Pannun: ఖలిస్తానీ ఉగ్రవాది, ‘సిఖ్ ఫర్ జస్టిస్’ ఉగ్రసంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నినట్లు, ఈ కుట్రను అమెరికా భగ్నం చేసినట్లు కథనాలు వచ్చాయి. అయితే ఈ కేసులో భారతీయుడిపై అమెరికా అభియోగాలు మోపింది. నిఖిల్ గుప్తా అనే 54 ఏళ్ల వ్యక్తి పన్నూ హత్యకు కుట్ర పన్నాడని అమెరికా ఆరోపిస్తుంది. పన్నూ హత్యకు సంబంధించి అంతకు ముందు యూఎస్ ప్రభుత్వం భారత్‌ని హెచ్చరించింది. అయితే ఇది తమ విధానం కాదని భారత్ స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో భారత్‌కి చెందిన నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్‌లో ఈ ఏడాది జూన్‌లో పట్టుకున్నారు. అమెరికా-చెక్ రిపబ్లిక్ మధ్య నేరస్తుల మార్పిడి ఒప్పందంపై అమెరికా అతడిని అప్పగించాలని ఒత్తిడి చేస్తుంది. అయితే ఇప్పటి వరకు అతడిని అమెరికాకు అప్పటించలేదు. యూఎస్ అధికారుల ప్రకారం.. పన్నూను చంపేందుకు నిఖిల్ గుప్తా, హంతకులకు 1,00,000 డాలర్లను చెల్లించేందుకు అంగీకరించాడని, ఈ ఏడాది జూన్ నెలలో ముందస్తుగా 15000 డాలర్లను ఇచ్చాడని పేర్కొన్నారు.
పన్నూ భారత సంతతికి చెందిన అమెరికా పౌరుడు. ఇతనికి అమెరికా, కెనడా ద్వంద్వ పౌరసత్వం ఉంది. సిక్కుల కోసం ప్రత్యేక దేశం కావాలని పోరాడుతున్నాడు. ఇతడిని భారత్ ఉగ్రవాదిగా గుర్తించింది. యూఎస్ న్యాయశాఖ ప్రకారం.. భారత ప్రభుత్వ ఉద్యోగి, ఇతరులతో కలిసి పనిచేస్తూ.. భారతదేశంలో ఇతర ప్రాంతాలలో యూఎస్‌కి చెందిన న్యాయవాది, ఓ రాజకీయ కార్యకర్త హత్యకు కుట్ర పన్నాడని పేర్కొంది. అమెరికా గడ్డపై యూఎస్ పౌరులను హత్య చేసే ప్రయత్నాలను మేము సహించము. ఇక్కడ, విదేశాల్లోని అమెరికన్లకు హాని కల్గించడానికి ప్రయత్నించే ఎవరినైనా దర్యాప్తు చేయడానికి అడ్డుకోవడానికి, ప్రాసిక్యూట్ చేయడానికి సిద్ధంగా ఉండండి అంటూ యూఎస్ అటార్నీ డామియన్ విలియమ్స్ ఒక ప్రకటనలో తెలిపాడు.
Read Also: Telangana Election 2023 Live updates: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల లైవ్ అప్ డేట్స్..
స్పందించిన భారత్..
అయితే ఈ విషయంపై భారత్ తీవ్రంగానే స్పందించింది. ఈ కేసును తాము పరిశీలిస్తున్నామని, హత్య కోసం నిఖిల్‌కి భారతదేశం నుంచి ఆదేశాలు అందాయని ఆరోపించడం సరికాదని భారత వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అమెరికా వద్ద ఎలాంటి ఆధారాలు లేవని వ్యాఖ్యానించాయి. విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ.. ఇటీవల భారత్-అమెరికా భద్రతా సహకారంపై ఇదరు దేశాల మధ్య చర్చలు జరిగాయని, వీటిలో భాగంగా వ్యవస్థీకృత నేరాగాళ్లు, ఉగ్రవాదులు, వారి మధ్య సంబంధాలు ఇతర అంశాల గురించి అమెరికా అధికారులు ఇన్‌పుట్స్ ఇచ్చారని, ఈ వ్యవహారంపై ఇప్పటికే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని ఆయన అన్నారు.
కెనడా స్పందన ఇదే..
కెనడాలోని సర్రే ప్రాంతంలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. అయితే తాజాగా అమెరికా చేస్తున్న ఆరోపణలు తమకు మరింత బలాన్ని ఇచ్చాయని అన్నారు. భారత్ దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని చెప్పారు.