Joe Biden: పాకిస్తాన్‌తో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నట్లుగా అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ చెప్పారు. ఈ మేరకు పాకిస్తాన్‌కి కొత్తగా ఎన్నికైన ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కి లేఖ రాశారు. ప్రాంతీయ శాంతి, ద్వైపాక్షిక సంబంధాలు చాలా కీలకమని అమెరికా అధ్యక్షుడు లేఖలో లెలిపారు. మానవ హక్కుల్ని పరిరక్షించడం కోసం పాకిస్తాన్‌తో కలిసి పనిచేయడానికి అమెరికా సిద్ధమని తెలిపారు. ఫిబ్రవరి 8న జరిగిన పాకిస్తాన్ ఎన్నికల తర్వాత పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్(పీఎంఎల్-ఎన్) పార్టీకి చెందిన షెహబాజ్ షరీఫ్ వరసగా రెండోసారి ప్రధాని పీఠాన్ని అధిష్టించారు.
Read Also: Saina Nehwal: కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మండిపాటు..
మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడైన షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో పీఎంఎల్-ఎన్ పార్టీ, బిలావల్ భుట్టోకి చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)తో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఇండిపెండెంట్లుగా పోటీ చేసి, భారీ సంఖ్యలో సీట్లను కైవసం చేసుకున్నప్పటికీ, అధికారానికి కావల్సిన సీట్లు అందుకోలేకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి పాక్ ఆర్మీ మద్దతు కూడా ఉంది.
ఇదిలా ఉంటే తమ పతనానికి అమెరికా కుట్ర పన్నిందని పలుమార్లు ఇమ్రాన్ ఖాన్ ఆరోపించిన తర్వాత, అవినీతి కేసుల్లో ఆయన జైలు పాలయ్యారు. అమెరికా కుట్ర చేసి తనను ప్రధాని పదవి నుంచి దించేసిందని ఆరోపించారు. ప్రధాని పదవిలో ఉండగా రష్యా పర్యటనకు వెళ్లిన ఇమ్రాన్ ఖాన్, ఉక్రెయిన్ యుద్ధానికి మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అతను పదవిని కోల్పోవాల్సి వచ్చింది.