కరోనా నేపథ్యంలో భారతీయులపై విధించిన వీసా నిషేధాన్ని చైనా ఎత్తేసింది. చైనా విధించిన ఆంక్షల వల్ల గత రెండేళ్లుగా స్వదేశంలోనే ఆగిపోయిన భారతీయ నిపుణులు, వారి కుటుంబ సభ్యులకు డ్రాగన్ శుభవార్త తెలిపింది. భారతీయ ప్రొఫెషనల్స్, వారి కుటుంబసభ్యులకు వీసా మంజూరు ప్రణాళికను సోమవారం ప్రకటించింది. ఈ మేరకు భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం కొవిడ్ వీసా పాలసీ అప్‌డేట్ చేసిం ది. వీసా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. భారతీయులతో పాటు చైనీయుల కుటుంబసభ్యులు, చైనాలో శాశ్వత నివాసం ఉన్న విదేశీయులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. చైనా కాలేజీలు, వర్సిటీల్లో తిరిగి చేరాలనుకునే భారత విద్యార్థుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుంటున్నది.
చైనా కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో ఆగిపోయిన తమ చదువులను కొనసాగించేందుకు ఆసక్తిగా వేల మంది భారతీయ విద్యార్థుల విజ్ఞప్తులను ప్రాసెస్ చేస్తోంది. కొవిడ్ వీసా విధానంలో మార్పు చేస్తూ భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటన వెలువరించింది. చైనాలో తమ ఉద్యోగాలను కొనసాగించాలనుకుంటున్న విదేశీయులు, వారి కుటుంబ సభ్యుల వీసా దరఖాస్తులను ఆమోదిస్తామని ప్రకటించింది. భారతీయులకు తోడు.. చైనా పౌరులు, చైనా శాశ్వత నివాస పర్మిట్లు ఉన్న విదేశీయులు, ఈ దేశంలో పనిచేసే విదేశీయుల బంధువులు కూడా వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. పర్యాటక, ప్రైవేటు అవసరాల కోసం ఇచ్చే వీసాలపై మాత్రం ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొంది.
భారతీయులకు తోడు వివిధ కంపెనీల కోసం పనిచేసే అనేక మంది చైనా ఉద్యోగులు కూడా భారత్‌లో చిక్కుకుపోయారు. కేంద్ర ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో.. స్వదేశంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థుల్లో కొందరిని తమ దేశంలోకి అనుమతిస్తామని డ్రాగన్ ఏప్రిల్‌లో ప్రకటించింది. అలాంటివారి వివరాలను సేకరించాలని బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయానికి సూచించింది. దేశంలో ఇటీవల కేసులు పెరిగిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో విదేశీయులను అనుమతించడానికి సుముఖంగా లేదు. వీసాలపై ఆంక్షలు సడలిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. రెండు దేశాల మధ్య విమాన సర్వీసులను పునఃప్రారంభించే అంశంపై చైనా స్పష్టత ఇవ్వలేదు.