అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్. గత సంవత్సరం కంటే ఈసారి రికార్డ్ స్థాయిలో స్టూడెంట్స్ వీసాలని జారీ చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఆ మేరకు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారిని పాట్రిసియా లసినా తెలిపింది. కరోనా సమస్యలు ఉన్నప్పటికీ.. గతేడాదిలో 62 వేల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు అందాయి. ఈసారి లక్ష దరఖాస్తుల్ని పరిశీలిస్తున్నామని పాట్రిసియా పేర్కొంది.
‘‘అమెరికా విద్యాసంస్థలకు, సమాజానికి తోడ్పాటునందిస్తున్న అంతర్జాతీయ విద్యార్థులకు.. ముఖ్యంగా భారతీయులకు మా దేశం ఎంతో విలువనిస్తుంది. అమెరికాలోని విదేశీ విద్యార్థుల సంఖ్యలో భారతీయలు రెండో స్థానంలో ఉన్నారు’’ అని పాట్రిసియా చెప్పారు. ప్రస్తుతం 2 లక్షలకు పైగా భారత విద్యార్థులు అమెరికాలోని వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్నారు. మొత్తం విదేశీ విద్యార్థుల్లో భారతీయుల సంఖ్య 20 శాతానికిపైగానే ఉందని పాట్రిసియా చెప్పుకొచ్చారు. ఎంబసీలో మంగళవారం నిర్వహించిన 6వ విద్యార్థి వీసాల దినోత్సవంలో ఆమె పై విధంగా మాట్లాడారు.
ఇదిలావుండగా.. విద్యార్థులు ఏజెంట్ ద్వారా కాకుండా సొంతంగా స్లాట్లను బుక్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే, స్లాట్‌ను ఏ ప్రదేశం నుంచి బుక్ చేశారో, ఆ ఐపీ అడ్రస్‌ను ట్రాక్ చేసి, రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. వీసా ఇంటర్వ్యూకు అవసరమయ్యే అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను అందుబాటులో ఉంచుకోవాలి.