అంతర్జాతీయ విమాన ప్రయాణాల్లో ఆల్కహాల్ సర్వీస్ అందుబాటులో ఉంది. కాకపోతే సిబ్బంది ఇచ్చిన మద్యం మాత్రమే తాగాలి. అఫ్‌కోర్స్ దానికి డబ్బులు కట్టాలనుకోండి. అది వేరే విషయం. విమానంలో మనం తీసుకెళ్లిన మందు తాగుతానంటే నిబంధనలు ఒప్పుకోవు. సేఫ్టీ, సెక్యూరిటీ రీత్యా బయటి మద్యాన్ని అనుమతించట్లేదు. కానీ.. రూల్స్ పాటిస్తే వాళ్లు మందుబాబులు అని ఎందుకు అనిపించుకుంటారు. లేటెస్టుగా ఢిల్లీ నుంచి లండన్‌కి వెళుతున్న ఓ విమానంలో ఇదే జరిగింది. వెంట తెచ్చుకున్న జిన్ బాటిల్‌లోని డ్రింగ్‌ని తాగేందుకు ప్రయత్నించిన ప్రయాణికుణ్ని ప్లైట్ అటెండర్ అడ్డుకోవటం తీవ్ర ఘర్షణకు దారితీసింది.
అడ్డుచెప్పిన స్టీవార్డ్‌ని ప్యాసింజర్ విపరీతంగా కొట్టాడు. చెవులు, ముక్క నుంచి రక్తం కారేలా చితకబాదాడు. విమానం గమ్యానికి చేరుకున్న తర్వాత నిందితుణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుణ్ని ఆస్పత్రిలో చేర్పించి కోలుకున్నాక ఇంటికి పంపించారు. ఈ ఘటన ఈ నెల 7వ తేదీన జరిగింది. కొంత మంది ప్రయాణికులు ఓ బృందంగా ఏర్పడి ఎయిరిండియా విమానం ఎక్కారు. అదే ఫ్లైట్‌లో ముంబైకి చెందిన ఓ అటెండర్ కూడా ఉన్నాడు. ప్యాసింజర్ల గ్రూపు మార్గమధ్యంలో మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో ఆ ప్రయాణికుడు తన లగేజీలోని బాటిల్‌ని బయటికి తీసి గ్లాసులో మద్యం పోసుకుంటున్నాడు.
ఇది గమనించిన అటెండర్ అలా చేయొద్దని, తాము ఇచ్చిన సీసాల్లోని మందునే తాగాలని మర్యాదపూర్వకంగా చెప్పాడు. దీంతో మద్యంమత్తులో ఉన్న ప్యాసింజర్‌కి మండింది. దిగ్గున లేచి ఆ సహాయకుణ్ని గల్లా పట్టుకొని డోర్‌కి ఆనించి విచక్షణారహితంగా కొట్టాడు. ఆరేడు సార్లు గట్టిగా చెయ్యి చేసుకున్నాడు. ఛాతీ మీద కూడా బాదాడు. దీంతో అటెండర్‌కి చెవులు, ముక్కు నుంచి రక్తం కారింది. అంతకుముందు.. అదే ప్రయాణికుణ్ని, అతని గ్రూపు సభ్యులను ముఖానికి మాస్కులు పెట్టుకోవాలని విమాన సిబ్బంది పదే పదే రిక్వెస్ట్ చేసినా పట్టించుకోలేదని తోటి ప్రయాణికులు చెప్పారు. దాడి విషయాన్ని ఎయిరిండియా అధికార ప్రతినిధి కూడా నిర్ధారించారు. కానీ వివరాలు చెప్పేందుకు నిరాకరించారు.