Taliban Urge Hindus, Sikhs To Return: ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్లిన మైనారిటీలైన హిందువులు, సిక్కులు తిరగి ఆప్ఘాన్ కు రావాలని తాలిబన్లు కోరుతున్నారు. దేశంలో భద్రతాపరమైన అంశాలు పరిష్కరించబడ్డాయని.. తమ మైనారిటీలు అయిన హిందువులు, సిక్కులు తిరిగి దేశానికి రావాలని కోరారు. తాలిబన్ రాష్ట్ర మంత్రి కార్యాలయం డైరెక్టర్ జనరల్ డాక్టర్ ముల్లా అబ్దుల్ వాసీ జూలై 24న ఆఫ్ఘనిస్తాన్ లోని హిందు, సిక్కు కౌన్సిల్ సభ్యులతో సమావేశమయ్యారు. భద్రతా కారణాల వల్ల దేశాన్ని వదిలి వెళ్లిన వారంతా ఇప్పుడు తిరిగా రావచ్చని కోరారు.
కాబూల్ లో గురుద్వారాపై ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ దాడిని అడ్డుకున్నందుకు సిక్కు ప్రతినిధులు తాలిబన్ నాయకులకు ధన్యవాదాాలు తెలిపారు. జూన్ 18న కాబూల్ లోని కార్తే పర్వాన్ గురుద్వారాపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఒక సిక్కుతో సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో గురుద్వారాలో 30 మంది వరకు ఉన్నారు. అయితే తాలిబన్ భద్రతా దళాలు పెద్దగా ప్రాణనష్టం జరగకుండా దాడిని అడ్డుకున్నారు.
Read Also: Canada: కెనడాలో కాల్పులు.. ఇద్దరు భారతీయ సంతతి వ్యక్తుల మృతి
ఆప్ఘనిస్తాన్ లో సిక్కులు, హిందువులు మైనారిటీలుగా ఉన్నారు. గత కొన్ని దశాబ్ధాలుగా వారు అక్కడే నివాసం ఉంటున్నారు. అయితే తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత మైనారిటీలపై దాడులు పెరిగాయి. ముఖ్యంగా ఐఎస్ ఉగ్రవాదులు మైనారిటీలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. గతంలో 2020 మార్చిలో కాబూల్ లోని శ్రీ గురు హర్ రాయ్ సాహిబ్ గురుద్వారాపై దాడి జరిగింది. ఆ దాడిలో 27 మంది సిక్కలు మరణించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రకటించారు. ఈ ఘటనల తరువాత చాలా మంది హిందువుల, సిక్కులు ఇండియాకు వచ్చారు.