Ukraine war: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగిస్తోంది. గత రెండు నెలలుగా యుద్ధం కొనసాగుతోంది. జరిపిన దాడుల్లో 8 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. డొనెట్‌స్క్‌లోని నియు–యోర్క్‌పై రష్యా సైన్యం జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోగా మరో ముగ్గురు గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. కొస్టియాంటీనివ్కాపై జరిగిన రాకెట్ల దాడిలో 20 వరకు ఇళ్లు, కార్లు, గ్యాస్ పైప్‌లైన్ ధ్వంసం కాగా ఇద్దరు మృతి చెందారు. ఒకరు గాయపడ్డారు. చెరినహివ్‌పై రష్యా క్రూయిజ్ మిస్సైళ్లు పడటంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. జపొరిఝియా అణు ప్లాంట్ పొరుగునే ఉన్న పట్టణంపై రష్యా జరిపిన దాడిలో ముగ్గురు పౌరులు గాయపడ్డారు. నల్ల సముద్రం ధాన్యం రవాణా ఒప్పందాన్ని రద్దు చేసిన రష్యా.. ఉక్రెయిన్ నౌకా తీర ప్రాంతం ఒడెసాను లక్ష్యంగా చేసుకుంది. రష్యా మిలటరీ ప్రయోగించిన రెండు క్రూయిజ్ మిస్సైళ్లు గిడ్డంగులపై పడటంతో మంటలు చెలరేగి పరికరాలు ధ్వంసమయ్యాయని.. 120 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు బూడిదయ్యాయని ఉక్రెయిన్ తెలిపింది. క్రిమియాపై దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులకు పాల్పడినట్లు రష్యా ప్రకటించింది.
Read also: MadhyaPradesh: ఇన్‌స్పెక్టర్ కూతురు స్నానం చేస్తుండగా.. సబ్ ఇన్‌స్పెక్టర్ కొడుకు వీడియో తీశాడు
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం పరిణామంపై తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ స్పందించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ డిమాండ్లను పశ్చిమదేశాలు నెరవేర్చి, ధాన్యం రవాణా కారిడార్ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాలని ఆయన సూచించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడతానని, వచ్చే నెలలో తుర్కియేలో ఆయనతో భేటీ ఉంటుందని ఆశిస్తున్నానని చెప్పారు. రష్యా ఆక్రమిత క్రిమియాలో వారం వ్యవధిలో రెండోసారి డ్రోన్ పేలింది. క్రాస్నోవార్డిస్క్‌లోని ఆయిల్ డిపో, ఆయుధ గిడ్డంగిలను డ్రోన్ బాంబులతో పేల్చేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. సోమవారం ఉక్రెయిన్ జరిపిన దాడిలో రష్యాను కలిపే కీలకమైన క్రిమియా వంతెన కొంతభాగం దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా, జపొరిఝియా ప్రాంతంలో ఉక్రెయిన్ శతఘ్ని కాల్పుల్లో రియా వార్తా సంస్థకు చెందిన రష్యా జర్నలిస్టు ఒకరు మృతి చెందినట్టు ప్రకటించారు.