5 Killed, 10 Injured In Shooting At Protesters In Busy Iran Market: హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో అట్టుడుకున్న ఇరాన్ లో కాల్పులు జరిగాయి. ఇరాన్ లోని నైరుతి ఖుజేస్తాన్ ప్రావిన్సులో నిరసనకారులు, భద్రతాబలగాలపైకి ఉగ్రదాడులు జరిగాయి. ఈ కాల్పుల్లో కనీసం ఐదుగురు మరణించినట్లు అక్కడి మీడియా బుధవారం వెల్లడించింది. రెండు మోటార్ సైకిళ్లపై వచ్చిన సాయుధ దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మరణించడంతో పాటు 10 గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, ఒక మహిళ మరియు ఒక బాలిక ఉన్నారని, క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ఖుజెస్తాన్ డిప్యూటీ గవర్నర్ వాలియోల్లా హయాతి తెలిపారు.
Read Also: Tholireyi Gadichindi: మురళీమోహన్ హీరో.. రజనీకాంత్ విలన్ !
అయితే ఈ ఘటనకు ఎవరూ కూడా బాధ్యత ప్రకటించుకోలేదు. అంతకుముందు కూడా ఇరాన్ లో ఇలాంటి ఘటనలు జరిగాయి. అక్టోబర్ 26న షిరాజ్ లోని షా చెరాగ్ సమాధిపై ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ దాడి చేసింది. ఈ ఘటనలో 13 మంది మరణించారు. సెప్టెంబర్ 16 నుంచి ఇరాన్ వ్యాప్తంగా యాంటీ హిజాబ్ నిరసనలు తీవ్రంగా జరుగుతున్నాయి. మహ్స అమిని అనే 22 ఏళ్ల యువతి హిజాబ్ ధరించలేదని చెబుతూ.. అక్కడి నైతికత పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత కొన్ని రోజులకు ఆమె మరణించారు. అప్పటి నుంచి ఇరాన్ యువత, మహిళలు ప్రభుత్వానికి నిరసనగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 300 మందికి పైగా మరణించారు. మహిళలు హిజాబ్ తీసేస్తూ.. జుట్టును కత్తిరించుకుంటూ నిరసన తెలుపుతున్నారు.
ఇదిలా ఉంటే ఇరాన్ ప్రభుత్వం అక్కడి నిర్ధాక్షణ్యంగా అణిచివేస్తోంది. ఇప్పటికే నిరసనల్లో పాల్గొన్న వారికి వరసగా ఉరిశిక్షలను విధిస్తోంది. నిరసనలు వరసగా మూడో నెలకు చేరడంతో ప్రభుత్వం కూడా అరెస్టులు, శిక్షలను పెంచింది. ఇప్పటివరకు అల్లర్లలో 15,000 మందిని అరెస్ట్ చేశారు.