Tolireyi Gdichindi: తమిళ సూపర్ స్టార్ గా జేజేలు అందుకుంటున్న రజనీకాంత్ వర్ధమాన నటునిగా సాగుతున్న రోజుల్లో కొన్ని తెలుగు చిత్రాలలోనూ నటించారు. మురళీమోహన్, జయచిత్ర జంటగా తెరకెక్కిన ‘తొలిరేయి గడిచింది’లో రజనీకాంత్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. 1977 నవంబర్ 17న ‘తొలిరేయి గడిచింది’ విడుదలయింది.
ఇంతకూ ఈ ‘తొలిరేయి గడిచింది’ కథ ఏమిటంటే – ఓ ఊరిలో పెద్ద షావుకారికి రమేశ్ అనే మనవడు ఉంటాడు. పట్నంలో ఉండి చదువుకుంటూ అక్కడ వసంత అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెనే పెళ్ళి చేసుకుంటానని తాతతో చెబుతాడు. ఆ తాతయ్య దగ్గర మేనేజర్ గా పనిచేసే గోవిందయ్యకు నాగిని అనే కూతురు ఉంటుంది. ఆమెను ఎలాగైనా రమేశ్ కు ఇచ్చి చేయాలన్నది గోవిందయ్య అభిలాష. తాతకు దూరపు చుట్టంగా వచ్చి, వారి వ్యాపార వ్యవహారాలు చూస్తున్న చిట్టిబాబు డబ్బు దోచేయడం తెలిసి అతడిని ఉద్యోగంలో నుండి తీసేస్తారు. తాత కబురు పెట్టారని రమేశ్ పరుగుతీస్తూ పల్లెకు వస్తాడు. వసంతకు కూడా చెప్పడు.
అదే సమయంలో వసంతకు ఉద్యోగం పోతుంది. రమేశ్ ను వెదుక్కుంటూ వెళ్తే, అతను ఊరెళ్ళాడని తెలుస్తుంది. తాను మోసపోయానని భావిస్తుంది వసంత. అనుకోకుండా పల్లెకు వచ్చి, గోవిందయ్య కూతురు నాగినికి ఇంగ్లిష్ బోదిస్తుందామె. రమేశ్ కు నాగినికి పెళ్ళి చేయాలనుకుంటాడు తాతయ్య. అయితే నాగిని వేరే వ్యక్తిని ప్రేమించి లేచిపోతుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న వసంతను బ్రతిమలాడి రమేశ్ కు ఇచ్చి పెళ్ళిచేస్తాడు తాతయ్య. తాను ప్రేమించిన అమ్మాయే భార్య అయినందుకు రమేశ్ సంతోషిస్తాడు. కానీ, తనను మోసం చేశాడని భావించిన వసంత, పెళ్ళయ్యాక పలు విధాల రమేశ్ కు చుక్కలు చూపిస్తుంది. చేయి దాకా వచ్చిన ఆస్తి కాస్తా పోయిందని ఏడుస్తున్న గోవిందయ్యకు చిట్టిబాబు వచ్చి తనను మళ్ళీ తాతయ్య ఇంట్లో అడుగుపెట్టనిస్తే, ఆస్తి ఎలా కొట్టేయాలో చెబుతానంటాడు. అలా ఇద్దరూ ఏకమవుతారు.
రమేశ్, వసంత మధ్య దూరం ఉందని పసిగడతాడు చిట్టిబాబు. తాత వల్ల రమేశ్ మనసులో ఇప్పటికీ తానే ఉన్నానని తెలుసుకున్న వసంత అతనితో కాపురం చేయాలని నిర్ణయిస్తుంది. అదే సమయంలో వారి తొలిరేయి గడవకుండా పాలల్లో విషం కలుపుతాడు చిట్టిబాబు. సమయానికి డాక్టర్ రావడంతో రమేశ్ బతికి బట్టకడతాడు. అయితే ఎలాగైనా రమేశ్ ను చంపాలని ఓ కాంట్రాక్ట్ కిల్లర్ తో మాట్లాడతారు గోవిందయ్య, చిట్టిబాబు. అయితే విషయం తెలుసుకున్న ఆ కిల్లర్ కు వసంత తన చెల్లెలు అని తెలుస్తుంది. దాంతో ఓ నాటకం ఆడి, గోవిందయ్య, చిట్టిబాబు దుర్మార్గం బయటపెడతారు. ఆ రౌడీ మరెవరో కాదు, గోవిందయ్య కూతురు మొగుడు కావడం ట్విస్ట్. చివరకు గోవిందయ్యను గెంటేస్తారు. అందరూ ఆనందంగా ఉండటంతో కథ ముగుస్తుంది.
ఇందులో మురళీమోహన్ హీరో కాగా, ఆయన సరసన జయచిత్ర నాయికగా నటించారు. కీలక పాత్రల్లో సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, మోహన్ బాబు, మాడా, సారథి, పొట్టిప్రసాద్, రమాప్రభ, జయమాలిని, విజయలలిత నటించారు. రజనీకాంత్ ఇందులో చిట్టిబాబుగా కనిపించారు.
ఈ చిత్రానికి సత్యం సంగీతం సమకూర్చగా, ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర, దాశరథి, సినారె పాటలు పలికించారు. ఈ చిత్రానికి గణేశ్ పాత్రో రచన చేశారు. సృజన కంబైన్స్ పతాకంపై ఎమ్.గోపాలకృష్ణారెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి కె.యస్.రామిరెడ్డి దర్శకత్వం వహించారు. “ఏ తీయని వేళ…నా ఊహలలోన…”గుడ్డంటే మంచిది…”, “జాబిలి మెరిసెలే… ఆశలు విరిసెలే…”, “ఇదో రకం… అదోరకం…” అంటూ సాగే పాటలు అలరించాయి. వీటిలో ఏసుదాస్ పాడిన “జాబిలి మెరిసెలే…” పాట జనాదరణ పొందింది.