Bangladesh Violence: రిజర్వేషన్ల కోటాపై బంగ్లాదేశ్‌లో చెలరేగిని హింస, చివరకు షేక్ హసీనా తన ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసి, దేశం వదిలి పారిపోయేలా చేసింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు కాబోతోంది. నోబెల్ విజేత మహ్మద్ యూనస్ ప్రధాని కాబోతున్నారు. ఇదిలా ఉంటే, షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయినా అక్కడ హింసాకాండ ఆగలేదు. ముఖ్యంగా మైనారిటీలైన హిందువులతో పాటు అవామీ లీగ్ పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తూ హత్యలు చేశారు. చాలా ప్రాంతాల్లో దేవాలయాలను తగలబెట్టడంతో పాటు హిందూ మహిళలపై అకృత్యాలకు పాల్పడ్డారు.
Read Also: Pawan Kalyan: అప్పుడు హీరో అడవులని కాపాడితే ఇప్పుడు చెట్లు నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు
హసీనా రాజీనామా చేసిన తర్వాత ఏకంగా 232 మంది హింసలో మరణించారని గురువారం మీడియా నివేదికలు చెప్పాయి. మొత్తంగా ఈ రిజర్వేషన్ల ఆందోళనల్లో చనిపోయిన వారి సంఖ్య 560కి చేరుకుంది. హసీనా పదవిలో ఉన్న సమయంలో అంటే జూలై 16 నుంచి ఆగస్టు 04 మధ్య 329 మంది చనిపోయారు. ఒక్క మంగళవారం రోజే వందల్లో మరణాలు సంభవించాయి. గాజీపూర్‌లోని కాశీంపూర్ హైసెక్యూరిటీ జైలు నుంచి మంగళవారం 209 మంది ఖైదీలు పారిపోయారు. ఖైదీలు పారిపోకుండా జైలు గార్డులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు సహా ఆరుగురు మరణించినట్లు జైలు వర్గాలు తెలిపాయి.
పోలీసుల్ని ఆందోళనకారులు టార్గెట్ చేసి హత్యలు చేస్తుండటంతో పలువురు పోలీస్ స్టేషన్లలో విధుల్లో చేరేందుకు భయపడుతున్నారు. ఈ మేరకు ప్రజలు పోలీసులకు సహకరించాలని పోలీస్ ప్రధాన కార్యాలయం కోరింది. బుధవారం కొత్తగా నియమితులైన ఇన్‌స్పెక్టర్ జనరల్ మైనుల్ ఇస్లాం మాట్లాడుతూ.. పోలీసులు 24 గంటల్లో విధుల్లో చేరాలని ఆదేశించారు. గత మూడు రోజులుగా ఢాకాతో పాటు పలు నగరాల్లో, పట్టణాల్లో ట్రాఫిక్‌ని విద్యార్థులే నియంత్రిస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా అవామీ లీగ్ నేతలు పారిపోకుండా చూస్తున్నారు. రాజ్‌షాహి సిటీ కార్పొరేషన్ వార్డ్ కౌన్సిలర్ మరియు రాజ్‌షాహి మెట్రోపాలిటన్ అవామీ లీగ్ జనరల్ సెక్రటరీ రజబ్ అలీతో పాటు అతని సహచరుడు జాకీర్ హొస్సేన్ దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా సరిహద్దు గార్డ్ బంగ్లాదేశ్ (BGB) చుడంగాలోని దర్శన ICP చెక్ పోస్ట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.