Pakistan: పాకిస్తాన్ దేశం బలూచిస్తాన్ ప్రావిన్సులోని జైలు నుంచి 17 మంది ఖైదీలు పరారయ్యారు. ఈద్ ఉల్ అదా(బక్రీద్) పండగ సమయంలో వీరంతా పక్కా ప్లాన్ తో జైలు నుంచి పారిపోయారు. ఈ ఘటన బలూచిస్తాన్ లోని చమన్ జైలులో జరిగింది. ఈద్ ప్రార్థనల సమయంలో జైలులో ఒక్కసారిగా ఘర్షణలు తలెత్తాయి. పక్కా పథకం ప్రకారం జైలులో ఖైదీలు గొడవలను సృష్టించి పారిపోవాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పారిపోతున్న సమయంలో జైలు గార్డులు జరిపిన కాల్పుల్లో ఒక ఖైదీ మరణించాడు.
Read Also: Rajasthan: పాము పగబట్టిందా.. 5 రోజుల వ్యవధిలో రెండుసార్లు కాటు.. రెండోసారి..
పండగ సందర్భంగా జైలు బ్యారక్ ఉన్న ఖైదీలను ప్రార్థనల కోసం బయటకు వచ్చారు. ఈ సమయంలో వారు పోలీస్ గార్డులపై హింసాత్మకంగా దాడి చేసినట్లు బలూచిస్తాన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్, మాలిక్ షుజా కాసి తెలిపారు. హింసలో కొంతమంది పోలీస్ గార్డులు, ఖైదీలు గాయపడ్డారని తెలిపారు. గొడవ జరుగుతున్న సమయంలో 17 మంది తప్పించుకోగా.. పోలీస్ గార్డులు జరిపిన కాల్పుల్లో ఓ ఖైదీ మరణించాడు.
ఖైదీలు తప్పించుకునేందుకు బయటి వ్యక్తుల సాయపడినట్లు తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. పారిపోయిన ఖైదీల జాబితా సిద్ధం చేశామని వారిలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తులు కూడా ఉన్నట్లు జైలు అధికారులు వెల్లడించారు. చమన్ జైలు ఇరాన్‌తో సరిహద్దు పట్టణానికి సమీపంలో ఉంది. పారిపోయిన ఖైదీలు తమ సహచరులు సహాయంతో సరిహద్దు దాటి ఉంటారని భద్రతా బలగాలు భయపడుతున్నాయి. అంతకుముందు బలూచిస్తాన్ టర్బాట్ నగరంలో ఒక మహిళా ఆత్మాహుతి బాంబర్ ఫ్రాంటియర్ కార్ప్స్ వాహనాన్ని ఢీకొట్టడంతో ఒక పోలీస్ అధికారి మరణించారు.