16 Killed, 24 Injured After Blast In Afghanistan:ఆఫ్ఘానిస్తాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. పిల్లలు, సాధారణ ప్రజలే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘన్ సమంగాన్ ప్రావిన్షియల్ ప్రావిన్స్ లోని అయ్‌బాక్ నగరంలోని మదర్సాలో బుధవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మొత్తం 16 మంది మరణించినట్లుగా సమాచారం. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనలో 24 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని నగరంలోని ఓ ఆస్పత్రిలో వైద్యుడు వెల్లడించాడు.
చనిపోయిన వారిలో మదర్సాలో విద్యను అభ్యసిస్తున్న పిల్లలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఇంకా తాలిబాన్ వర్గాలు స్పందించలేదు. ఈ ఘటనకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత ప్రకటించుకోలేదు. అయితే గత ఏడాది ఆగస్టులో అమెరికా వైదొలిగిన తర్వాత ఆఫ్ఘాన్‌లో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసి తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అయితే వీరు అధికారం తీసుకున్నప్పటి నుంచి అక్కడ ఐసిస్ ఖొరాసన్ తీవ్రవాద సంస్థ దాడులకు పాల్పడుతోంది. ఇప్పటి వరకు అక్కడ ఉన్న పలు మసీదుల్లో, సిక్కు ప్రార్థనా మందిరాలపై దాడులు చేసింది. ఈ ఘటనల్లో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. ముఖ్యంగా మైనారిటీలు అయిన షియాలు, ఖుర్దులనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది.
మరోవైపు తమ తలతిక్క నిర్ణయాలతో అఫ్ఘాన్ భవితను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు తాలిబాన్లు. అక్కడ షరియా చట్టాలు తీసుకువచ్చి స్త్రీలకు హక్కులు లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే స్త్రీలను చదువుకు దూరం చేశారు. ఇదిలా ఉంటే తాలిబాన్ల నిర్ణయాల వల్ల ప్రపంచదేశాలు ఆఫ్ఘానిస్తాన్ కు సహాయాన్ని నిలిపివేశాయి. దీంతో అక్కడ విపరీతమైన పేదరికం ఏర్పడింది. మరోవైపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో డ్యూరాండ్ రేఖపై స్పష్టత లేకపోవడంతో ఇరుదేశాల మధ్య ఘర్షణలు ఏర్పడుతున్నాయి.