Israel: అక్టోబర్ 07 నాటి హమాస్ దాడులకు ఏడాది అవుతున్న తరుణంలో ఇజ్రాయిల్ అప్రమత్తమైంది. అయితే, ఆదివారం రోజు దక్షిణ ఇజ్రాయిల్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పల్లో ఒకరు మరణించగా, 10 మంది గాయపడినట్లు ఇజ్రాయిల్ పోలీసులు తెలిపారు. దక్షిణ ఇజ్రాయిల్‌లోని బీర్ షెవాలో ఆదివారం కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ దాడిలో పారామెడిక్స్‌కి చెందిన 25 ఏళ్ల మహిళ మరణించినట్లు ప్రకటించారు. ఈ దాడిని అనుమానిత ఉగ్రదాడిగా పరిగణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Israel-Gaza War: గాజా నుంచి ఇజ్రాయిల్‌పై రాకెట్లు ప్రయోగించిన హమాస్..
బీర్ షేవాలోని సెంట్రల్ స్టేషన్‌లో కాల్పులు జరిగినట్లు, అనుమానిత ఉగ్రవాదిని చంపేసినట్లు పోలీసులు తెలిపారు. గతవారం ఇజ్రాయిల్ వాణిజ్య రాజధాని టెల్ అవీవ్‌లో ఇలాగే తుపాకీ కాల్పులు చోటు చేసుకున్నా్యి. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే తాజా కాల్పుల సంఘటన చోటు చేసుకుంది.
గతేడాది అక్టోబర్ 07న హమాస్ ఇజ్రాయిల్‌పై వందలాది రాకెట్లతో దాడులు చేసింది. హమాస్ మిలిటెంట్లు 1205 మంది ఇజ్రాయిలీలను ఊచకోత కోశారు. 240 కన్నా ఎక్కువ మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లారు. అప్పటి నుంచి గాజా యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో 40 వేలకు పైగా పాలస్తీనియన్లు మరణించారు.