తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మమతా మోహన్ దాస్ కంటూ ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఏ భాషనైనా అవలీలగా పలికేయడం మమతా మోహన్ దాస్ కు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఈ పొడుగు కాళ్ళ సుందరి ఎంచక్కా తెలుగులోనూ పలు చిత్రాల్లో పాటలు పాడేసింది. ఇక నటిగానూ మురిపించిన మమతాలో గొప్ప ఫైటింగ్ స్పిరిట్ ఉంది. క్యాన్సర్ ను జయించి మరి సినిమాల్లో రీ-ఎంట్రీ ఇచ్చిన మమతను మెచ్చుకోని వారే ఉండరు. ఇదిలా ఉంటే ప్రస్తుతం తమిళంలో విక్రమ్, ఆర్య కలిసి నటిస్తున్న ‘ఎనిమి’ చిత్రంలో మమతా మోహన్ దాస్ నటిస్తోంది. మృణాళినీ రవి కూడా మరో లీడ్ రోల్ ప్లే చేస్తోందీ సినిమాలో. ఇటీవల మమతా మోహన్ దాస్ బెహ్రైన్ లో హార్లీ డేవిడ్ సన్ బైక్ ను అలవోకగా నడిపేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నిజానికి పదిహేనేళ్ళ క్రితం మమతా మోహన్ బెంగళూరు వీధుల్లో ఎంచక్కా బైక్ నడిపేదట. కానీ సినిమా స్టార్ అయిన తరవాత అలాంటి ఛాన్స్ ఆమెకు దక్కలేదట. అయినా ఆనాటి డ్రైవింగ్ మెళకువలను ఇప్పటికీ మర్చిపోలేదని, అప్పటిలానే బైక్ ను రైడ్ చేశానని చెప్పింది మమతా మోహన్ దాస్. ఆ వీడియోను ఇన్ స్టాలోనూ పోస్ట్ చేయడంతో అభిమానులు మమతా డేరింగ్ డ్రైవింగ్ నేచర్ ను అప్రిషియేట్ చేస్తున్నారు.