Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఓ ఐస్ ఫ్యాక్టరీ యజమాని తన వర్కర్లపై కర్కషంగా ప్రవర్తించాడు. ఇద్దరు కార్మికులను తీవ్రమైన చిత్రహింసలకు గురిచేశాడు. దొంగతనం చేశారనే అనుమానంతో వారిద్దరికి కరెంట్ షాక్‌లు ఇస్తూ, గోళ్లు ఊడపీకి హింసించాడని శనివారం పోలీసులు తెలిపారు. రాజస్థాన్ భిల్వారా జిల్లాకు చెందిన అభిషేక్ భంబి, వినోద్ భంబి అనే ఇద్దరు బాధితులను ఒక కాంట్రాక్టర్ ద్వారా కోర్బా జిల్లాలోని గుర్జార్ యాజమాన్యంలోని ఒక ఐస్ ఫ్యాక్టరీలో పనిచేయడానికి నియమించుకున్నారు.
Read Also: India Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ లీడర్ హత్య.. భారత్ ఆగ్రహం..
ఏప్రిల్ 14న గుర్జార్, అతడి సహచరుడు ముఖేష్ శర్మ ఇద్దరు కార్మికులపై దొంగతనం ఆరోపణలు చేశారు. వీరిద్దరి బట్టలు విప్పి, విద్యుత్ షాక్ ఇచ్చి, వారి గోళ్లను వేళ్ల నుంచి బయటకు తీసి హింసించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. వీడియో క్లిప్‌లో అర్ధనగ్నంగా ఉన్న వ్యక్తికి విద్యుత్ షాక్ ఇచ్చి కొడుతున్నట్లు కనిపిస్తోంది. ఇద్దరు బాధితులు తప్పించుకని భిల్వారాలోని వారి స్వస్థలానికి చేరకున్న తర్వాత గులాబ్‌పురా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
రాజస్థాన్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కోర్బా పోలీసులకు కేసును పంపారు. శుక్రవారం కోర్బాలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో గుర్జార్, శర్మలపై కేసు నమోదైంది. బాధితుల్లో ఒకరైన అభిషేక్ భంభి తన వాహనం ఇన్‌స్టాల్‌మెంట్ కోసం యజమాని నుంచి రూ. 20,000 అడ్వాన్స్‌గా అడిగానని, యజమాని అందుకు నిరాకరించడంతో ఉద్యోగం మానేస్తానని చెప్పానని, దీంతో అతడికి కోపం వచ్చి తమపై దాడికి పాల్పడినట్లు చెప్పాడు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని, తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.