పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చెల్లి శవంతో అక్క నాలుగురోజులుగా సహజీవనం చేస్తోంది. చెల్లి మృతి చెందినట్లు ఎవరికి తెలియనివ్వకుండా ఆమె శవం వద్దే కూర్చొని విలపిస్తోంది. చివరికి ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు వెళ్లి చూడడం విషయం బయటపడింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. ప్రగతినగర్‌కు చెందిన దంపతులకు స్వాతి, శ్వేత అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం తల్లి చనిపోగా తండ్రి ఇద్దరు కూతుళ్లను వదిలి వెళ్ళిపోయాడు. దీంతో అప్పటినుంచి ఇద్దరు అక్కాచెల్లెళ్లు కలిసి నివసిస్తున్నారు. అయితే గత వారం రోజులుగా శ్వేత కనిపించడం లేదు. ఆమె ఎక్కడ అని అడుగగా స్వాతి మాట్లాడడం లేదు.
సోమవారం సాయంత్రం స్వాతి ఇంటి నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో స్థానికులు ఇంటిలోపలికి వెళ్లి చూడగా.. శ్వేత శవం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. దీంతో స్థానికులు కంగుతిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బెడ్ పై చెల్లి శవాన్ని పడుకోపెట్టి.. ఆమె కింద వంట చేసుకుంటూ, తింటూ నాలుగురోజులుగా ఆ దుర్వాసనలోనే గడుపుతుంది. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. చెల్లి అనారోగ్యంతో మృతిచెందిన ఆమె చెప్పకపోవడానికి కారణం .. స్వాతికి మతిస్థిమితం సరిగ్గా లేదని, అంతకుముందు అక్కాచెల్లెళ్లు, తల్లి చనిపోయినప్పుడు రెండు రోజులు శవం వద్దే ఉన్నారని స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.