మూఢనమ్మకాలు ప్రజలను ఎంతటి దారుణానికైనా పాల్పడేలా చేస్తాయి. తాజాగా ఈ మూఢనమ్మకం వలన ఒక వివాహిత ప్రాణాలు కోల్పోయిన ఘటన గుంటూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. తూబాడుకు చెందిన ఆటో డ్రైవర్ రవికి రెండేళ్ల కిందట సన్నితతో వివాహమైంది. అయితే ఇప్పటివరకు సన్నిత కడుపు పండలేదు.. ఎన్నో గుడులు, గోపురాలు తిరిగారు అయినా ఫలితం లేకుండా పోయింది.
ఇక ఈ నేపథ్యంలోనే బంధువులు వేరొక మహిళా ప్రసవించిన బొడ్డు తాడు తింటే వెంటనే పిల్లలు పుడతారని చెప్పడంతో ఈ నెల 13 న వేరే మహిళ ప్రసవించడంతో బొడ్డుపేగు తెచ్చిన కుటుంబ సభ్యులు సన్నితకు తినిపించారు. అది తిన్న రెండు రోజుల తరువాత ఆమె అనారోగ్యం పాలయ్యింది. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ శనివారం ఆమె మృతిచెందింది. తన కుమార్తెను అత్తింటి వారు తరచూ వేధిస్తూ ఆమె చేత విషపదార్థం తినిపించి హత్య చేశారంటూ సన్నిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపైకేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.