Vijayawada Horror: విజయవాడలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మందు తాగేందుకు కేవలం రూ.10 ఇవ్వలేదన్న కారణంతో ఓ వృద్ధుడిని మైనర్ బాలుడు కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్టీనగర్ లౌక్య బార్ సమీపంలో గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో జరిగింది. మైనర్ బాలుడు ప్రసాద్ మద్యం మత్తులో మందు కొనడానికి డబ్బులు సరిపోకపోవడంతో అక్కడే ఉన్న వృద్ధుడు బుల్ రాజును రూ.10 ఇవ్వమని అడిగాడు. వృద్ధుడు డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహానికి గురైన మైనర్ బాలుడు కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన వృద్ధుడు రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే వృద్ధుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Read Also: MSVPG : చిరు ఫ్యాన్స్ తో దర్శకుడు అనిల్ రావిపూడి ఫ్రెండ్లీ మీట్
మృతుడు బుల్ రాజు తాపి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆయన స్వస్థలం మంగళగిరి నులకపేట కాగా, ఉపాధి కోసం విజయవాడలో ఉంటూ పని చేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టగా, అదే సమయంలో మైనర్ బాలుడు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మద్యం మత్తులో చిన్న కారణంతో ప్రాణం తీసిన ఈ దారుణంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.