Crime: ఉత్తర్ ప్రదేశ్ కౌశాంబిలో ఒక వివాహిత మహిళను సొంత బంధువైన వ్యక్తి కాల్చి చంపాడు. తన కోరికలను తిరస్కరించిన కారణంగా గురువారం ఉదయం 24 ఏళ్ల మహిళను చంపాడు. గత కొంత కాలంగా మహిళపై ఒత్తిడి తెస్తున్నప్పటికీ, ఆమె నిరాకరిస్తూ వస్తోంది. దీంతో కోపం పెంచుకున్న వ్యక్తి ఆమెను చంపేశాడు. బాధితురాలిని పోలీసులు దీపికా తివారీగా గుర్తించారు. ఆమె కొన్ని రోజుల క్రితం తన పుట్టింటికి వచ్చింది. 2022లో వివాహం చేసుకున్న దీపికాకు ఏడాదిన్నర బాబు ఉన్నారు. నిందితుడిని అజిత్ కుమార్ మిశ్రా(28)గా గుర్తించారు. దీపికా ఇంట్లో ఉన్న సమయంలో ఆమెను కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Karnataka Congress: పెద్ద ప్లానే.. డీకే శివకుమార్‌కు చెక్ పెట్టేందుకు సిద్ధరామయ్య వ్యూహం..
నిందితుడు అజిత్ హత్యకు ఉపయోగించిన పిస్టల్‌తో పోలీసులు ముందు లొంగిపోయాడు. అధికారులు ప్రాథమిక దర్యాప్తు నిర్వహించి, మృతదేహాన్ని శవపరీక్ష కోసం పంపారు. పోలీస్ అధికారుల చెబుతున్న వివరాల ప్రకారం, దీపికా, అజిత్ అత్త కూతురు. ఆమెకు ఇష్టం లేకున్నా అజిత్ కుమార్ దీపికాపై ఆశలు పెంచుకున్నాడు. వివాహం తర్వాత కూడా ఆమె తనతో ఉండాలని ఒత్తిడి చేస్తూనే ఉన్నాడు. దీపికా అజిత్ ప్రయత్నాలను ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూనే ఉంది. అతడితో సంబంధం పెట్టుకోవడంపై ఆసక్తి చూపించలేదు. ఈ కారణంతోనే ఆమెను హత్య చేసినట్లు ఎస్పీ రాజేష్ సింగ్ చెప్పారు. అజిత్‌ను అరెస్ట్ చేసి, ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.