హైదరాబాద్‌లో దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రజలు దృష్టి మళ్లించి ఏటీఎం కార్డులు దొంగిలించి నగదు దోచుకుంటున్న ముగ్గురు కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి వివిధ బ్యాంకులకు సంబంధించిన ఏటీఎం కార్డులు, రూ.7.6 లక్షల నగదు, ఒక నకిలీ పోలీస్ ఐడీ కార్డను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహర మీడియాతో మాట్లాడారు. బహుదూర్‌పురాలో డిసెంబర్ 22న ఒక మహిళ ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేస్తుండగా దృష్టి మళ్లించి నకిలీ ఏటీఎం కార్డు చేతిలో పెట్టి ఒరిజినల్ కార్డు తీసుకెళ్లి రూ.2లక్షలు విత్‌డ్రా చేశారని తెలిపారు. కేసు నమోదు చేసి అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు పేర్కొ్న్నారు. ముగ్గురిని అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు.
ఇది కూడా చదవండి: Saif Ali Khan : ముంబైలో సైఫ్ దాడి చేసిన వ్యక్తికి ‘సంరక్షకుడు’గా వ్యవహరించిన జితేంద్ర పాండే ఎవరు?
ఈ అంతరాష్ట్ర ముఠా సభ్యులు నాలుగు రాష్ట్రాల్లో ఇలాంటి తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు డీసీపీ చెప్పారు. నిందితుల టార్గెట్ అంతా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలే అన్నారు. ఏటీఎం సెంటర్స్ దగ్గర డబ్బులు డ్రా చేసే సమయంలో వారికి సహాయం చేస్తున్నట్టు నటించి డూప్లికేట్ కార్డు పెట్టి ఒరిజినల్ కార్డు తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో 18 కేసుల్లో నిందితులుగా ఉన్నారన్నారు. ఏటీఎం సెంటర్ల దగ్గర నగదు విత్‌డ్రాలు చేసేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీసీపీ స్నేహ మెహర పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Bank Holidays List 2025: ఈ ఏడాది తెలంగాణలో బ్యాంక్ సెలవుల లిస్ట్ ఇదే.. మొత్తం ఎన్ని రోజులంటే?