Teen Kills Mother: కొడుకుని స్కూల్ వెళ్లాలని నిద్రలేపేందుకు వెళ్లిన తల్లి హత్యకు గురవుతుందని ఎవరు ఊహిస్తారు. కానీ, ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. డిసెంబర్ 03న ఆర్తీ దేవి అనే మహిళ తన 17 ఏళ్ల కొడుకు అమన్‌ని స్కూల్‌కి వెళ్లేందుకు నిద్రలేపింది. కానీ సదరు యువకుడు మానసిక స్థితి బాగా లేదు. తన తల్లిపై కోపంతో బలంగా నేలకోసి కొట్టడంతో తలకు బలమైన గాయం తగిలి మరణించింది.
ఆర్తి భర్త చెన్నైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో సైంటిస్ట్ అయిన రామ్ మిలన్ ఆమెకు చాలా సార్లు కాల్స్ చేసిన స్పందన లేదు. అయితే, ఫోన్ స్విచ్ఛాప్‌గా ఉండటంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. తల్లిని హతమార్చిన తర్వాత అమన్, సీసీటీవీ కట్ చేసి, ఇంటికి తాళం వేసి శవంతోనే నాలుగు రోజులు ఉన్నాడు. శరీరం నుంచి కుళ్లిపోయిన వాసన రావడంతో అగర్‌బత్తీలు మట్టించి వాసనని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ఐదో రోజు అమన్ బయటకు వెళ్లి సమీపంలోనే ఆలయంలో ఉండాలని అనుకున్నాడు.
Read Also: Deputy CM Pawan Kalyan: ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజు యువతకు స్ఫూర్తి
రెండు మూడు రోజుల తర్వాత కూడాఫోన్ కాల్స్‌కి ఆర్తి నుంచి సమాధానం రాకపోవడంతో, కంగారు పడిన రామ్ మిలన్, తన మరదలికి డయల్ చేసి, తన కుటుంబం పరిస్థితిని చూడాలని కోరాడు. ఇంటి లోపల నుంచి తాళం వేసి ఉండటాన్ని గమనించింది. పట్టలేనంతగా దుర్వాసన వస్తుండటంతో ఏదో జరిగి ఉంటుందని అనుమానించింది. డిసెంబర్ 08న గోరఖ్‌పూర్ వచ్చిన భర్త రామ్ మిలన్ రక్తపుమడుగులో పడి ఉన్న భార్య మృతదేహాన్ని చూశాడు.
కుటుంబీకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, యువకుడిని సమీపంలోని గుడిలో గుర్తించారు. గదిలో రెండు చోట్ల రక్తపు మరకల్ని గుర్తించారు. మృతదేహాన్ని లాగేందుకు ప్రయత్నించినట్లు ఉంది. అతడి రూం నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇరుగుపొరుగు వారి కథనం ప్రకారం.. అమన్ వ్యసనాలకు బానిస అయ్యాడని, కోచింగ్ పేరుతో తల్లి దగ్గర డబ్బు తీసుకుని మద్యం, డ్రగ్స్ కోసం ఖర్చు చేసేవాడని తేలింది. స్కూల్‌లో కూడా అతడిపై కంప్లైంట్స్ ఉన్నట్లు గుర్తించారు.
డిసెంబర్ 03న ఉదయం తల్లి ఆర్తీ, అమన్‌ని స్కూల్‌కి వెళ్లాలని కోరిందని, ఆ తర్వాత డబ్బు విషయమై గొడవ జరిగిందని, తల్లి కోపంతో అతడిపై డబ్బులు విసిరిందని, దీంతో కోపంతో అమన్ ఆమెను తోసేయడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. విచారణలో యువకుడు నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు.