Deputy CM Pawan Kalyan: ఫిడే ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ పోటీల్లో విజేతగా నిలిచిన గుకేశ్ దొమ్మరాజుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. చెస్ ఛాంపియన్‌గా నిలిచిన పిన్న వయస్కుడిగా గుకేశ్ చరిత్ర సృష్టించడం భారతీయులందరికీ గర్వకారణమన్నారు. ప్రఖ్యాత చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ తరవాత గుకేశ్ ఛాంపియన్‌గా నిలవడం చదరంగ అభిమానులకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. విశ్వనాథ్ ఆనంద్ స్పూర్తితో ఎందరో చదరంగ క్రీడాకారులు ప్రపంచ స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచారు, ఆ క్రమంలోనే మన తెలుగు రాష్ట్రాల నుంచి కోనేరు హంపి, పి. హరికృష్ణ, ద్రోణవల్లి హారిక, వర్షిణి, అర్జున్ గ్రాండ్ మాస్టర్స్‌గా నిలిచారన్నారు. నవతరానికి గుకేశ్ స్ఫూర్తిగా నిలుస్తాడన్నారు. గుకేశ్ దొమ్మరాజు తమిళనాడులోని తెలుగు కుటుంబానికి చెందినవాడు కావడం తెలుగువారికి మరింత ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. భవిష్యత్తులో గుకేశ్ మరిన్ని విజయాలు సాధించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.
Read Also: Mangampeta Incident: మంగంపేట హత్యకేసులో పురోగతి.. నిందితుడు ఆంజనేయప్రసాద్ అరెస్ట్