Sonali Phogat: రెండు రోజుల కిందట గోవా పర్యటనలో టిక్ టిక్ స్టార్, బీజేపీ నాయకురాలు సోనాలీ ఫోగాట్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత గుండెపోటుగా భావించిన పోలీసులు.. పోస్టుమార్టం నివేదిక అనంతరం హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అక్కడి రెస్టారెంట్‌లో పార్టీలో పాల్గొన్న సమయంలో సహాయకులు ఆమెకు బలవంతంగా ఓ రసాయనాన్ని ఎక్కించి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. తర్వాత ఆమెను టాయిలెట్‌లోకి తీసుకెళ్లారని, అక్కడ నిందితులు, ఫోగాట్ రెండు గంటల పాటు ఉన్నారని గోవా ఐజీపీ ఓంవీర్ సింగ్ బిష్ణోయ్ శుక్రవారం వెల్లడించారు. ఈ కేసులో సోనాలీ ఫోగాట్ సహాయకులు సుధీర్ సాంగ్వాన్, సుఖ్వీందర్ వసీలను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
నిందితులు సోనాలీ ఫోగాట్‌కు క్లబ్‌లోలో సింథటిక్ డ్రగ్ ఇచ్చారని గోవా ఐజీపీ ఓంవీర్ సింగ్ బిష్ణోయ్ తెలిపారు. సింథటిక్ డ్రగ్ అని చెప్పారు కానీ, ఆ పదార్థం పేరు ఏమిటన్నది వెల్లడించలేదని తెలిపారు. ఆ పదార్థాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆ డ్రగ్ ఇచ్చిన అనంతరం ఆమెను టాయిలెట్‌లోకి తీసుకెళ్లారని, అక్కడ నిందితులు, ఫోగాట్ రెండు గంటలపాటు ఉన్నారని.. అక్కడ ఏం జరిగిందో మాత్రం నిందితులు నోరు విప్పలేదన్నారు. అయితే ఆమెకు వారిచ్చిన డ్రగ్స్ కారణంగానే మరణించినట్లు తెలుస్తోందన్నారు.
Pizza delivery man shot: చిరిగిన నోటును తీసుకోనందుకు పిజ్జా డెలివరీ బాయ్‌పై కాల్పులు
అయితే పోస్టుమార్టం నివేదికలో మాత్రం సోనాలీ ఫోగాట్ శరీరంపై పలు చోట్ల గాయాలు ఉన్నట్టు తేలింది. దాంతో ఆమెతో పాటు ఉన్న ఆ సహాయకులపై హత్యానేరం కింద పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. సోనాలీ మరణంపై అనుమానం వ్యక్తంచేస్తూ ఆమె సోదరుడు రింకూ ఢాకా బుధవారం అంజునా పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సోనాలీ అనుమానాస్పద మృతి వెనక హరియాణాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. దానిపై ఆమె సోదరుడు రింకూ స్పందించారు. ‘అలాంటిది ఏమీ లేదు’ అని వాటిని తోసిపుచ్చారు.