తేజ సజ్జ, ప్రియాంక వారియర్ నటించిన ‘ఇష్క్’ సినిమా చూసే ఉంటారు. ఒంటరిగా కనిపించిన జంటను పోలీసులమని చెప్పి ఇద్దరు బెదిరించి వారి వద్ద డబ్బు గుంజుతారు. అంతేకాకుండా అమ్మాయితో అసభ్యకరంగా మాట్లాడతాడు. సేమ్ ఇదే తరహాలో ఇద్దరు వ్యక్తులు తిరుపతిలో ఒంటరిగా కనిపించిన జంటలకు పోలీసులు అని చెప్తూ దాడికి పాల్పడుతున్నారు. తిరుపతిలో అర్ధరాత్రి రోడ్లపై ఎవరైనా జంట కనిపిస్తే ఈ ఇద్దరు నిందితులు తాము పోలీసులమని, తమ వద్ద ఉన్న డబ్బు, నగలు ఇచ్చేస్తే మిమ్మల్ని వదిలేస్తామని లేకపోతే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి పరువు తీస్తామని బెదిరిస్తున్నారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బారీడులా ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాపు కాసి నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.35వేలు, 61 గ్రాముల బంగారం, బైక్, 3 సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. వారిపై చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయని, నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.