రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లక్ష్మీగూడలో నవ వధువు వసంత ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటు చేసకుంది. అదనపు కట్నం, భర్త వేధింపులు భరించలేక నవ వధువు బలవన్మరణంకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో తన గది లో ఫ్యాన్ కు తాడుతో ఉరి వేసుకొని వసంత ఆత్మహత్య చేసుకుంది. వసంత తన గదిలో నుండి ఎంతకీ బయటకు రాకపోవడంతో గది తలుపులను కుటుంబ సభ్యులు బద్దలు కొట్టారు. దీంతో ఫ్యాన్‌కు వ్రేలాడుతూ వసంత కనిపించింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న మైలార్ దేవిపల్లి పోలీసులు.. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే భర్త రమేశ్ వసంతను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని, వివాహం జరిగి తొమ్మిది నెలల్లో అదనపు కట్నం తేవాలని మానసికంగా, శారీరకంగా భర్త రమేశ్ వేధించినట్లు వసంత బంధువులు ఆరోపిస్తున్నారు.