తామిద్దరం భార్యాభర్తలమని చెప్పి ఓ ఇంట్లో పని మనుషులుగా చేరిన ఓ జంట.. అదును చూసి భారీ చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఓనర్లు లేని సమయం చూసి.. నగదు, నగలు దోచేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. నేపాల్‌కి చెందిన చక్రధర్, సీత అనే జంట 8 నెలల క్రితం వి. దామోదర్‌రావు ఇంట్లో పనిమనుషులుగా చేరారు. మూడేళ్ల కుమారుడు కూడా కలిగిన ఈ దంపతులు.. ఆ ఇంటి ప్రాంగణంలోనే ఉన్న ఓ గదిలో ఉండేవారు. ఈనెల 2వ తేదీన నాగ్‌పూర్‌కి వెళ్లిన ఆ జంట.. 10వ తేదీని తిరిగొస్తూ తమతో ఓ వ్యక్తిని వెంటబెట్టుకొని వచ్చారు. తమ బంధువేనని చెప్పారు.
కట్ చేస్తే.. ఈనెల 12వ తేదీన దామోదర్‌రావు తన కుటుంబసభ్యులతో కలిసి ఓ ఫంక్షన్‌కి వెళ్లారు. వాళ్లు వెళ్లిన 10 నిమిషాలకే ఇంటికి మరోవైపు ఉన్న తలుపు గడియను పగలగొట్టి.. రూ. 30 లక్షల నగదు, 25 లక్షల విలువ చేసే నగలను చోరీ చేశారు. 9:30 గంటలలోపు ఆ మొత్తం తీసుకొని, లక్డీకపూల్ వెళ్లారు. అక్కడికి వెళ్లాక ఫోన్లు స్విచ్చాఫ్ చేశారు. ఇక్కడ 11:30 గంటల తర్వాత దామోదర్‌రావు కుటుంబీకులు ఫంక్షన్ నుంచి తిరిగొచ్చారు. తలుపులు తెరిచి ఉండటం, నగదు, నగలు కనిపించకపోవడం, పని మనుషులు కూడా మాయం అవ్వడంతో.. తమ ఇంట్లో చోరీ జరిగిందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. తొలుత ఫోన్ లొకేషన్ ఆధారంగా లక్డీకపూల్ వరకూ వెళ్లారని తెలుసుకోగలిగారు కానీ, అక్కడ స్విచ్చాఫ్ చేయడంతో ఎక్కడికి వెళ్లారో పోలీసులకు తెలియడం లేదు. నేపాల్‌కి పారిపోయారా? లేక నగరంలోనే ఎక్కడైనా తలదాచుకున్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఆ దొంగల్ని పట్టుకోవడం కోసం ఆరు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు.