రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకొంది… గంజాయి మత్తులో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. నిద్రపోతున్న భార్య తలను నరికి పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. రాజేంద్రనగర్లోని ఇమాద్నగర్లో ఫర్వేజ్ కు సమ్రిన్ తో 14 ఏళ్ళ క్రితం వివాహమైంది.. వీరికి ఇద్దరు కుమారులు , ఇద్దరు కుమార్తెలు. పెళ్ళైన కొద్ది రోజులు సజావుగా సాగిన వీరి కాపురంలో విభేదాలు తలెత్తాయి. ఫర్వేజ్ గంజాయికి బానిసగా మారి భార్యను, పిల్లలను కొట్టడం మొదలుపెట్టాడు. దీంతో విసిగిపోయిన భార్య పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక కొన్నిరోజుల క్రితం తాను మారిపోయానంటూ భార్యకు నచ్చజెప్పి.. రెండోసారి ఆమెను పెళ్ళాడి ఇంటికి తీసుకొచ్చాడు. అప్పుడు కూడా అతనిలో మార్పు రాలేదు కదా భార్యపై అనుమానం పెరిగింది. దీంతో నిత్యం గంజాయి సేవిస్తూ భార్యను చిత్రహింసలకు గురిచేస్తుండేవాడు.
ఇక ఈ క్రమంలోనే అనుమానం పెరిగి భార్యను హతమార్చాలని ప్లాన్ వేశాడు. శుక్రవారం తెల్లవారుజామున భార్య నిద్రపోతుండగా అతికిరాతకంగా ఆమె తలను నరికి వేరుచేశాడు.. అనంతరం ఆ తలను పట్టుకొని సరాసరి పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. ఉదయం పిల్లలు లేచిచూసేసరికి తల్లి మొండెం కనిపించడంతో భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.