ఐఫోన్ అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి..! ధరలు మరీ ఆకాశాన్నంటే స్థాయిలో ఉండటంతో.. మధ్యతరగతి వారు దాన్ని కొనుగోలు చేసేందుకు సాహసించరు. అదే.. కొన్నాళ్లకు తక్కువ ధరకే అందుబాటులోకి వస్తే మాత్రం, కొనేందుకు ఎగబడుతుంటారు. అప్పుడప్పుడు పాత మోడళ్లను ఆఫర్ల పేరుతో తక్కువ ధరకే ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెడితే.. విక్రయాలు ఎలా జరుగుతాయో అందరికీ తెలిసిందేగా! క్షణాల్లోనే అమ్ముడుపోతాయి.
ఇలా జనాల్లో ఐఫోన్‌కి ఉన్న క్రేజ్ చూసే.. ఓ ముఠా ఆన్‌లైన్ మోసానికి పాల్పడింది. ఒక ఐఫోన్ కొంటే మరొకటి ఉచితం అంటూ ప్రకటన ఇచ్చింది. అది కూడా తక్కువ ధరకే అంటూ యాడ్ పోస్ట్ చేసింది. ముందుగానే డబ్బులు పే చేస్తే.. పేర్కొన్న సమయానికి మీ ఇంటికి ఫోన్లు చేరుకుంటాయని ఆ యాడ్‌లో పేర్కొంది. ఆ యాడ్ చూసి నమ్మిన కొందరు.. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నారు. అంటే, రోజులు గడిచినా వారికి ఫోన్లు రాలేదు. ఇచ్చిన ఫోన్ నంబర్‌కు తిరిగి ఫోన్ చేస్తే.. ఎలాంటి స్పందన ఉండదు. ఈ విధంగా ఆ ముఠా ఆన్‌లైన్‌లో భారీ డబ్బులు కాజేసింది.
ఈ ఐఫోన్ ఫ్రాడ్‌పై కొందరు బాధితులు హైదరాబాద్ తుకారం గేట్ పోలీసుల్ని ఆశ్రయించగా.. వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. తొలుత హైదరాబాద్‌లో ఓ ముఠాని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని విచారించిన తర్వాత ప్రధాన కార్యాలయం పూణేలో ఉందని తెలుసుకుని, దానిపై దాడి చేశారు. ఈ కేసులో పోలీసులు మొత్తం 8 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. 94 బ్యాంక్ అకౌంట్‌లతో పాటు 51 ఏటీఎం కార్డుల్ని సీజ్ చేశారు.