Father Kills Son: కన్నతండ్రి.. కొడుకును అల్లారుముద్దుగా చూసుకోవాలి. కానీ హైదరాబాద్‌లో ఓ కసాయి తండ్రి.. చేజేతులా 3 ఏళ్ల కొడుకు ఊపిరి తీసేశాడు. అంతే కాదు ఎవరికీ తెలియకుండా డెడ్ బాడీని మూసీ నదిలో పడేశాడు. ఏం తెలియనట్లు కొడుకు కనిపించడం లేదని డ్రామా ఆడాడు. చివరకు సాంకేతిక ఆధారాలతో పోలీసులకు దొరికిపోయాడు. ఆ కంత్రీ తండ్రిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. అమాయకంగా కనిపిస్తున్న ఇతని పేరు మహ్మద్ అక్బర్. హైదరాబాద్ పాతబస్తీలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య సనా బేగం, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద కొడుకు వయసు ఏడేళ్లు.. చిన్న బాబుకు మూడేళ్ల వయసు ఉంటుంది. కూరగాయలు అమ్ముకునే వ్యాపారం చేస్తున్నాడు. భార్య సనా బేగం నీలోఫర్ ఆస్పత్రిలో కేర్ టేకర్‌గా పని చేస్తోంది..
READ ALSO: Affair Murder: మొగిడి ప్రాణాలు తీస్తున్న మోజు.. దారుణంగా కొంత మంది భార్యల తీరు
రోజూ భార్య సనా బేగంతో అక్బర్ గొడవ
సంసారం బాగానే సాగుతోంది. ఐతే చిన్న బాబు అనాస్‌కు ఇటీవల ఆరోగ్యం సరిగా ఉండడం లేదు. ఆస్పత్రిలో చూపిస్తే.. గుండెలో రంధ్రం ఉందని తేల్చారు. గుండె జబ్బుకు చికిత్స చేయించాలని సూచించారు. దానికి పెద్ద ఎత్తున డబ్బు ఖర్చవుతుందని తెలిపారు వైద్యులు. ఆ విషయంలో ఇంట్లో రోజూ భార్య సనా బేగంతో గొడవ పెట్టుకుంటున్నాడు అక్బర్. ఇలా కొద్ది రోజుల నుంచి జరుగుతున్నా.. ఆమె పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పటి లాగే నైట్ డ్యూటీ కోసం ఆస్పత్రికి వెళ్లింది. ఆ సమయంలో అక్బర్ ఓ కంత్రీ ఆలోచన చేశాడు. గుండె జబ్బుతో బాధపడుతున్న కొడుకు అనాస్‌ను చంపేయాలని నిర్ధారించుకున్నాడు. అనుకున్నదే తడవుగా తలగడతో మక్కు అదిమి పట్టి అనాస్ ఊపిరి తీశాడు. బాలుడు చనిపోయాడని నిర్ధారించుకున్నాడు. ఆ తర్వాత డెడ్ బాడీ మాయం చేసేందుకు స్కెచ్చేశాడు.
ఉదయం కొత్త డ్రామా షురూ చేసిన అక్బర్
తెల్లవారుజామున కొడుకు డెడ్ బాడీని సంచిలో మూటగట్టుకున్నాడు అక్బర్. ఆ తర్వాత నయాపూల్ వద్ద బ్రిడ్జి పై నుంచి డెడ్ బాడీని మూసీ నదిలో పడేశాడు. అక్కడి నుంచి నేరుగా ఇంటికి వచ్చేసిన అక్బర్.. ఉదయం కొత్త డ్రామా షురూ చేశాడు. కొడుకు కనిపించడం లేదని నాటకం ఆడాడు. అంతే కాదు.. ఏకంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లెయింట్ కూడా చేశాడు. అదే సమయంలో అంతకు ముందు బంధువులు తన బిడ్డను ఇంటి దగ్గర దింపేసినట్లు ఫోన్ చేసి చెప్పారని పోలీసులకు తెలిపాడు. ఐతే అతని ఫోన్ పరిశీలించగా.. అలాంటి కాల్ ఏదీ రాలేదని తేలింది. దీంతో పోలీసులు తండ్రి మీదనే అనుమానం వ్యక్తం చేశారు. 3 ఏళ్ల అసాన్ మిస్టరీ మిస్సింగ్‌పై సీసీ ఫుటేజీలు పరిశీలించారు పోలీసులు. దీంతో అసలు విషయం బయటపడింది. అక్బర్.. ఓ సంచిలో ఏదో తీసుకు వెళ్తున్నట్లుగా కనిపించింది. అర్ధరాత్రి ఏం తీసుకు వెళ్తున్నావని తమదైన శైలిలో ప్రశ్నించే సరికి నిజం ఒప్పుకున్నాడు. తానే హత్య చేశానని.. డెడ్ బాడీని మూసీలో పడేసినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు..హైడ్రా బృందంతో కలిసి మూసీలో తనిఖీలు చేపట్టారు.
కొడుకుకు అనారోగ్యం ఉంటే చికిత్స చేయించాలి.. కానీ ఏకంగా చంపేస్తే పనైపోతుందనుకున్నాడు. కానీ బిడ్డను హత్య చేసిన నేరం తన మీద పడుతుందని ఊహించలేకపోయాడు. పోలీసులు రిమాండ్‌కు తరలిచండంతో ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నాడు. కన్న కొడుకును చంపిన అక్బర్‌ను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు..
READ ALSO: Moolakona Mystery: ఆస్తి కోసమా.. పరువు కోసమా? మూలకోన అటవీ ప్రాంతంలో మిస్టరీ డెత్స్ కలకలం..