HYD DONGALU ARREST: బంగారం ధర.. అందనంత రేంజ్‌కు పెరిగిపోతోంది. అసలే బంగారం అంటే విలువైనది.. ఇంకా రేటు పెరుగుతున్నా కొద్దీ విలువ మరింత పెరుగుతోంది. ఈ క్రమంలో బంగారం కొనుగోలు చేయడమే కాదు.. ఇంట్లో ఉన్న బంగారాన్ని కాపాడుకునేందుకు కష్టాలు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఎదురైంది. బంగారం చోరీ చేసేందుకు అంతర్రాష్ట్ర దొంగలు.. గోతికాడ నక్కల్లా ఉండడమే కాదు.. ఏకంగా గోడలు దూకి మరీ ఇంట్లోకి వచ్చేస్తున్నారు. అందినకాడికి దోచుకెళ్తున్నారు. అలాంటి అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచర్ల కనకదుర్గ కాలనీలో జనవరి 15న 9 ఇళ్లలో చోరీకి తెగబడ్డారు అంతర్రాష్ట్ర దొంగలు. కత్తులు, ఇతర మారణాయుధాలతో హల్ చల్ చేశారు. 9 ఇళ్లల్లో తలుపులు, కిటికీలు పగలగొట్టి లోపలకు దూరారు. అంతే కాదు.. బీరువా తాళాలు పగలగొట్టి బంగారం, వెండి వస్తువులతోపాటు అందిన కాడికి నగదు దోచుకుని దర్జాగా వచ్చిన దారినే వెళ్లిపోయారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
Read Also: DELHI WIFE MURDER: కమాండోకు కట్నం కాటు.. డంబెల్‌తో దాడి చేసి హత్య..
బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. పండగపూట సొంతూళ్లకు వెళ్లి వచ్చే సరికి ఇళ్లు గుల్ల చేసిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నారు. ఈ చోరీలో ముగ్గురు దొంగలు పాల్గొన్నట్లు చెబుతున్నారు పోలీసులు. వారిని డిల్లీకి చెందిన మహాదేవ్ లాల్, పవన్ గుప్త, ఉత్తర ప్రదేశ్‌కి చెందిన మంగళ్ సింగ్‌గా గుర్తించారు. వారి వద్ద నుంచి రూ. 2 లక్షల 4 వేలతోపాటు 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు నిందితులు దోచుకున్న బంగారాన్ని కరిగించిన వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పట్టుబడ్డ నిందితులపై ఇప్పటికే ఢిల్లీలో పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న మహదేవ్ లాల్ తీహార్ జైలులో శిక్ష అనుభవించినట్లు పోలీసులు గుర్తించారు. పలు దోపిడీ కేసుల్లో పవన్ గుప్త, మంగళ్ సింగ్ తీహార్ జైలుకు వెళ్లిన సమయంలో ముగ్గురు ముఠాగా ఏర్పడి నేరాలు చేయడం స్టార్ట్ చేశారు.