వాడు భర్త కాదు.. నరరూప రాక్షసుడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు భార్యలను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. మొదటి భార్యను హీటర్‌తో కొట్టి చంపాడు. ఆ కేసులో జైలుకెళ్లి, బెయిల్‌పై బయటకొచ్చాడు. అనంతరం మరో యువతిని ప్రేమ వివాహం చేసుకున్న ఆ దుర్మార్గుడు.. తొమ్మిది నెలలు తిరక్కముందే డంబెల్‌తో బాది చంపేశాడు. ఈ దారుణ ఘటన జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
కొత్తగూడలోని ఓ మాల్‌లో పని చేసే సరోజ (21)కు పూల అలంకరణ చేసే అనిల్‌కుమార్‌తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో.. పెద్దల సమక్షంలో తొమ్మది నెలల క్రితం వివాహం చేసుకున్నారు. అప్పట్నుంచి దంపతులు సుభాష్ చంద్రబోస్‌నగర్‌లో కాపురం ఉంటున్నారు. అయితే.. కొన్ని రోజుల తర్వాత భర్తకు తనకంటే ముందే మరో మహిళతో వివాహమైందని, నలుగురు పిల్లలు కూడా ఉన్నారని సరోజకు తెలిసింది. అప్పట్నుంచి వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నెల 1వ తేదీన భర్త తనని తీవ్రంగా కొట్టినట్టు సరోజ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది.
2వ తేదీ తిరిగి తల్లిదండ్రులు ఫోన్ చేయగా, సరోజ నుంచి స్పందన రాలేదు. దీంతో ఆందోళణకు గురైన పేరెంట్స్.. ఆదివారం ఆమె ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో, వాళ్లు జూబ్లీహిల్స్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. సోమవారం మరోసారి ఇంటికి వెళ్లిన సరోజ తల్లిదండ్రులు, ఈసారి తాళం పగలగొట్టి లోపలికి వెళ్లారు. దుర్వాసన వస్తుండడంతో పోలీసులకు సమాచారం అందించగా, వాళ్లు రంగంలోకి దిగారు. ఇంట్లో సోదాలు నిర్వహించగా, నీళ్ల డ్రమ్ముల్లో సరోజ మృతదేహం కనిపించింది. అతడు డంబెల్‌తో కొట్టి చంపినట్టు పోలీసులు నిర్ధారించారు.
ఇదే సమయంలో అనిల్‌కుమార్ గతంలో ఇలాంటి దారుణానికే పాల్పడ్డాడని తేలింది. 2009లో అనితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, నలుగురు పిల్లలు పుట్టాక అదనపు కట్నం కసం వేధించాడని తెలిసింది. అయితే.. 2020 మే 3న భార్యని కరెంట్ హీటర్‌తో కొట్టి, తలను గోడకేసి మోది చంపాు. ఆ కేసులో అనిల్ రిమాండ్‌లో ఉండి, ఏడాది క్రితం బెయిల్‌పై వచ్చాడు. అనుమానంతోనే మొదటి భార్యని అనిల్ చంపాడని, రెండో భార్యనూ అదే అనుమానంతో చంపి ఉంటాడని స్థానికులు చెప్తున్నారు.