డేటింగ్ వెబ్‌సైట్స్, యాప్‌ల పేరిట ఆన్‌లైన్‌లో ఘరానా మోసాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే! యువతి ఆశ చూపించి.. వేలు, లక్షలు, కోట్లు కొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఎవరెవరు డేటింగ్ వెబ్‌సైట్లకు విచ్చేస్తున్నారో తెలుసుకొని, వారికి వల వేసి, డబ్బులు దండేసుకుంటున్నారు. తాజాగా ఓ వైద్యుడు ఈ సైబర్ నేరగాళ్ల గాలంలో చిక్కుకొని, అక్షరాల కోటిన్నర పోగొట్టుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
గుజరాత్‌లో వైద్యుడిగా పని చేస్తోన్న ఓ వ్యక్తి.. ఇటీవల జిగోలో వెబ్‌సైట్, యాప్‌లలో డేటింగ్ చేసే యువతుల కోసం గాలించాడు. ఈ క్రమంలోనే ఒక నంబర్‌కి కాల్ చేయగా.. సైబర్ నేరగాళ్లు వెంటనే స్పందించారు. మీకు కావాల్సిన అందమైన అమ్మాయిని పంపుతామని, హీరోయిన్ కంటే చాలా బాగుంటుందని ఆశ చూపించారు. కానీ, అందుకు భారీ మొత్తం సమర్పించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అమ్మాయి గురించి చెప్పగానే టెంప్ట్ అయినా ఆ డాక్టర్.. ఇది నిజమా? మోసమా? అని గ్రహించకుండా, విడతల వారీగా వారికి రూ. 40 లక్షలు సమర్పించుకున్నాడు.
డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్లు స్పందించకపోవడంతో.. తాను మోసపోయానని గ్రహించి, 2020 అక్టోబర్‌లో సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించాడు. అంత భారీ మొత్తం కోల్పోయిన తర్వాత కూడా ఆ డాక్టర్‌లో మార్పు వచ్చిందా? అంటే లేదు. ఇంకా కేసు దర్యాప్తులో ఉండగానే.. యువతి మోజులో పడి మరో రూ. 30 లక్షలు నిందితుల ఖాతాకు పంపించాడు. అప్పుడు పోలీసులు అతడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం లోక్ అదాలత్‌లో కేసు రాజీ కుదుర్చుకున్నాడు. అయినా ఆ వైద్యుడి తీరు మారలేదు. యువతి కోసం మళ్లీ నగదు పంపాడు. పలు దఫాలుగా రూ. 80 లక్షలు బదిలీ చేశాడు.
అతని కుటుంబ సభ్యులు బ్యాంక్ ఖాతాను పరిశీలించినప్పుడు.. అసలు విషయం బయటపడింది. గత మూడేళ్లలో వైద్యుడు యువతుల మోజుల పడి, పలు ఖాతాలకు కోటిన్నర సమర్పించినట్టు తెలిసింది. దీంతో పోలీసులు మరోసారి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఓ సైబర్ నేరస్థుడి ఖాతాలో భారీ నగదు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇంకేముంది, అతడ్ని పక్కా ప్లాన్ ప్రకారం అదుపులోకి తీసుకున్నారు.