Girls Black Mailing in soicial media: ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌లోనే కొందరు వేధింపులకు గురిచేస్తున్నారు. దీని కోసం సోషల్ మీడియాను అస్త్రంగా వాడుకుంటున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో కొందరు యువతులు కొందరు అబ్బాయిల నంబర్లను సంపాదించి వీడియో కాల్స్ చేసి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారు. వాట్సాప్ ఛాటింగ్‌లతో హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. కొందరు యువతులు చేస్తున్న వాట్సాప్ ఛాటింగ్‌లు వైరల్ అవుతున్నాయి. వీడియోలను ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌తో పాటు ఫ్యామిలీ మెంబర్లకు పంపుతామని.. తాము అడిగినంత డబ్బు ఇవ్వాలని యువతులు డిమాండ్ చేస్తుండటంతో కొందరు బాధితులను పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
అయితే వీడియో కాల్స్ చేసి వేధిస్తున్న యువతుల ఆచూకీ కోసం పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. సదరు యువతులు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో కూపీ లాగుతున్నారు. ఇలా వందల సంఖ్యలో యువతుల నుంచి కాల్స్ వస్తుండటంతో అబ్బాయిలు వీడియో కాల్ లిఫ్ట్ చేయాలంటేనే వణికిపోతున్నారు. వీడియో కాల్ లిఫ్ట్ చేస్తే ఎలాంటి సమస్య ఎదురవుతుందన్న సంశయంతో కొట్టుమిట్టాడుతున్నారు.